జియోసైన్సెస్‌లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు

జియోసైన్సెస్‌లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు
ఖనిజాన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. జియోసైన్సెస్‌లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు వేస్తోందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, విపత్తుల నివారణ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి వినూత్న సాధనాలను అందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించడంలో భూభౌతికశాస్త్రం పాత్ర కీలకమని ఆయన వివరించారు. 

హైదరాబాద్‌లోని బండ్లగూడ- నాగోల్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (జీఎస్ ఐటీఐటీఐ)లో ‘నెక్స్‌ట్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025: అన్ లాక్ ఎర్త్ హిడెన్ ట్రెజర్స్’ సదస్సును ప్రారంభిస్తూ సహజ వనరుల శాస్త్రీయ అన్వేషణలో భారత్ దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ మైలురాయిని ఆయన ఒక నిదర్శనంగా అభివర్ణించారు. 

కొండచరియలు విరిగిపడడాన్ని ముందుగా సూచించే జాతీయ కేంద్రం ఏర్పాటు, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి ఇటలీతో ఇటీవల అవగాహన ఒప్పందం (ఎంఓయు) సహా భారత్ సాధించిన ప్రధాన పురోగతుల్ని కిషన్ రెడ్డి వివరించారు. పర్యవేక్షణ వ్యవస్థలను విస్తరించాలని, ముందస్తు హెచ్చరికలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ సంస్థల పెరుగుదల 318 శాతం ఉన్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిక్షిప్త ఖనిజ వనరులను అంచనా వేయడం, భూకంప సమాచారాన్ని మరింత కచ్చితత్వంతో వివరించడం సహా మెరుగైన అన్వేషణ కోసం కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జియో సైంటిస్టులను కోరారు.

రూ.10,300 కోట్లతో చేపట్టిన ఇండియా ఏఐ మిషన్, రూ.6,000 కోట్లతో చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి ఆయన ప్రముఖంగా పేర్కొన్నార. కృత్రిమ మేధ ఆధారిత, శుభ్రమైన, సమర్థవంతమైన అన్వేషణ పద్ధతుల ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి భారత ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ ‘జియోసైన్స్ ఒక మార్పు దశలోకి ప్రవేశిస్తోందని, ఇక్కడ సంప్రదాయ పద్ధతులు కృత్రిమ మేధ ఆధారిత అంచనా నమూనాలు, క్వాంటమ్ సెన్సింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కలిసి వనరుల అన్వేషణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వికసిత భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయని తెలిపారు. 

ఖనిజ భద్రత, పర్యావరణ సుస్థిరత, ప్రకృతి వైపరీత్యాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో జియోసైంటిఫిక్ పరిశోధన కీలక పాత్రను ఆయన వివరించారు.  అంతకుముందు ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్ రెడ్డి జిఎస్‌ఐలో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు హైడ్రోస్టాటిక్ డ్రిల్ రిగ్‌లను ప్రారంభించారు. ఇది భారత్ భౌగోళిక శాస్త్ర సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు.