కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం

కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం
ప్రజల నమ్మకాన్ని పొందామని, నిలబెట్టుకుంటామని చెబుతూ కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన`పై తిరుపతి రూరల్ దామినేడులో శుక్రవారం జరిగిన విజయోత్సవ సభలో మాట్లాడుతూ  వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని చెప్పారు.
పోలవరం, అమరావతి, విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రజల సేవకు పునరంకితమయి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రాయలసీమ అభివృద్ధిలో భాగంగా హంద్రీనీవాను కుప్పానికి తీసుకొచ్చామని, భవిష్యత్‌‌లో కల్యాణిడ్యాంకు కృష్ణాజలాలను తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నను తిరుమల వెంకన్నతో కలుపుతామని చెప్పారు. రాయలసీమ ప్రాంతంలోని వివిధ ఖనిజాల ద్వారా వేర్వేరు పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, విధ్వంసమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు.
 
విశాఖకు గూగుల్, కాగ్నిజెంట్, టిసిఎస్ వంటి ఐటీ కంపెనీలు వస్తే, అమరావతికి క్వాంటం వ్యాలీ వస్తోందని చెబుతూ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి, మన రాష్ట్రం పురోగతి సాధించాలి, మన యువతకు ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. పాజిటివ్ పాలిటెక్స్ తో కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంటే పాయిజన్ పాలిటిక్స్ తో గొడ్డలి పార్టీ ఉందని ధ్వజమెత్తారు. 
 
ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గెలుపుగా కాకుండా బాధ్యతగా భావిస్తూ పాలన మొదలు పెట్టామని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు శాశ్వతంగా ఉండాలనుకుంటే ఎంపి, ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజలతో మమేకమై ఉండాలని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. అధికారులైనా, కార్యకర్తలైనా తప్పుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు పెత్తందారులుగా కాకుండా, ప్రజా సేవకులుగా మెలగాలని చంద్రబాబు
 
ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు. ప్రజలు తమ తీర్పు ద్వారా బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాకుండా ఒక సందేశం, హెచ్చరిక, దిశానిర్దేశం అవుతుందని చెప్పారు. ప్రజలు మౌనంగా కనిపించినా అవసరమైన సమయంలో చరిత్రను మార్చగలరని మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ప్రజలు కూటమికి ఇచ్చింది కేవలం అధికారం కాదని, ఒక బాధ్యత అని చెప్పారు. 

రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అభివృద్ధి నిజంగా నమ్మశక్యం కాని స్థాయిలో ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కేవలం రెండు సంవత్సరాల్లోనే రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం విశేషమని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సంస్థల్లో ఒకటైన గూగుల్ తన దేశం వెలుపల అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం రాష్ట్ర ప్రతిష్ఠను పెంచిందని చెప్పారు.

గతంలో విశాఖ ఉక్కు కర్మాగారం సంక్షోభంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రబాబు నాయుడు కలిసి దానిని రక్షించారని మాధవ్ గుర్తు చేశారు. ప్రస్తుతం మరోసారి సమస్యలు ఎదురైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన సహాయం అందించి కర్మాగారాన్ని నిలబెట్టేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వని విధంగా రూ.11,414 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని విశాఖ ఉక్కు కర్మాగారానికి అందించారని తెలిపారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందని చెబుతూ కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నందున ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మారుతోందని స్పష్టం చేశారు. తొలుత చంద్రబాబు, పవన్ కల్యాణ్, పివిఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్,  సహచర మంత్రులు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి,  చేతులు పట్టుకుని నిలబడి ‘కలిసి నడుస్తాం` అని ప్రకటించారు.