80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రోజు శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారతదేశాన్ని నక్సల్ రహిత దేశంగా మార్చడం దేశానికి ఒక ప్రధాన విజయమని, ఎందుకంటే ఇది ప్రభావిత ప్రాంతాలలో “సమ్మిళిత” అభివృద్ధికి వీలు కల్పిస్తుందని తెలిపారు. “దశాబ్దాలుగా, నక్సలిజం దేశానికి ఒక తీవ్రమైన సవాలుగా నిలిచింది. భారతదేశాన్ని నక్సల్ రహిత దేశంగా మార్చడం ఒక ప్రధాన విజయం. ఒకప్పుడు నక్సలిజంతో ప్రభావితమైన ప్రాంతాలలో నేడు ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఈ ప్రాంతాలలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోంది,” అని ముర్ము తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.
2047 నాటికి భారతదేశం “వికసిత్ భారత్” నిర్మాణ దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంటూ, ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి వ్యక్తికి చేరాలని రాష్ట్రపతి ముర్ము ఉద్ఘాటించారు. “భారతదేశం ఆధునిక దేశం దిశగా పయనిస్తున్నందున, అభివృద్ధి ఫలాలు ప్రతి వ్యక్తికి చేరాలి,” అని ఆమె పేర్కొన్నారు. “మే 7న, ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, మన సాయుధ దళాల అసమాన శౌర్యాన్ని స్మరించుకున్నాము.” అని చెప్పారు.
“ఉగ్రవాదంపై జరిగిన ఈ ఆపరేషన్, భారత సాయుధ దళాల కచ్చితమైన సామర్థ్యాలకు నిదర్శనం. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు ఒక గట్టి సందేశం పంపబడింది. వారు ఎక్కడ దాక్కున్నా, వారి చర్యలకు తప్పకుండా శిక్షించబడతారని స్పష్టం చేసింది.” అని కొనియాడారు. పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశ నిర్ణయానికి రాష్ట్రపతి కూడా మద్దతు తెలిపారు.
“ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశంతో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, దేశం, దాని రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఒక నిర్ణయాత్మక చర్య” అని ఆమె చెప్పారు. ఇటీవల పేపర్ లీక్‌లు, వాటికి సంబంధించిన ఆత్మహత్యలపై జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో, “పరీక్షలను సంస్కరించడానికి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోంది” అని ముర్ము పేర్కొన్నారు.
పబ్లిక్ పరీక్షలను “మన విద్యార్థులకు అవకాశాల ద్వారాలు”గా అభివర్ణిస్తూ, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి సమష్టి కృషి అవసరమని ముర్ము నొక్కి చెప్పారు. “జాతీయ భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం, సమాజం ఐక్యంగా ఉండాల్సినట్లే, మన విద్యార్థుల వర్తమాన, భవిష్యత్తును కాపాడటానికి ప్రతిఒక్కరూ ఉమ్మడి, సమష్టి కృషితో తమ వంతు సహకారం అందించాలి,” అని ఆమె పిలుపిచ్చారు.
అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఆమె ఆకాంక్షించారు. అంతేకాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను మనం గుర్తుంచుకోవాలని రాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించిన ఆమె న్యాయ వ్యవస్థను, చట్టసభలను మనం గౌరవించాలని ప్రజలకు సందేశమిచ్చారు. తాజాగా లోక్‌సభ్‌లో మొట్టమొదటిసారిగా ఆలపించిన వందేమాతరం గీతాన్ని పౌరులంతా గౌరవించాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి కోరారు.
“మరికొన్ని గంటల్లో మనం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. దేశ ప్రజలతో పాటు విదేశాల్లోని భారతీయులు సైతం జెండా పండుగలో సగర్వంగా పాల్గొననున్నారు. మన మూడు రంగుల జెండా స్వాతంత్య్రానికి ప్రతీక. ఈ పతాకాన్ని మనం ఎంతో గౌరవంతో ఎగురవేస్తాం. 1947, ఆగస్టు15వ తేదీన బ్రిటీష్‌వారి కబంద హస్తాల నుంచి మన నేలకు స్వేచ్ఛ లభించింది” అని తెలిపారు.
“మనదేశంలోని విద్యార్థులు, టీచర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి కోసం ఆతృతగా ఉన్నారు. అలానే వైద్యులు, వైద్యరంగంలోని సిబ్బంది ఆరోగ్య రంగంలో కృషి చేస్తున్నారు. రైతులు పంటలు పండించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగమవుతున్నారు. మిగతా రంగాల్లోని వారు సైతం రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను నిర్వర్తిస్తున్నారు. వారందరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా” అని చెప్పారు.
ఘనమైన వారసత్వ సంపద, స్వాతంత్య్ర పోరాటంలోని ఆశయాలనుంచి మనం ఆధునిక యుగంలో అడుగుపెట్టామని రాష్ట్రపతి పేర్కొంటూ ‘వయం రాష్ట్రీ జగ్రియమ్’ అనే వేదవాక్కు మనందరినీ దేశం పట్ల జాగరూకతతో ఉండడంలో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. “ఈరోజు ఆగస్టు 14. ఈ రోజును విభజన భయానక దృశ్యాలను గుర్తుచేసుకునే రోజు. విభజన సమయంలో చెలరేగిన మతపరమైన హింస కారణంగా లక్షలాది మంది బలవంతంగా శరణార్ధులుగా మారారు. అయినా సరే ఇప్పటికీ వారు తమ గుర్తింపును మాత్రం వదులుకోలేదు” అని ఆమె స్పష్టం చేశారు.
“ప్రజల ఆశయాలు చట్టసభల్లో తెలియజేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత. పౌరులు, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించాల్సిన బాధ్యత చట్టాలను అమలు చేసేవాళ్లపై ఉంది. ఏ ఒక్కరు కూడా న్యాయానికి దూరమవ్వకుండా చూడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరిపై ఉంది” అని ఆమె తెలిపారు. గత దశాబ్దంలో మన దేశం ఎంతో వేగంగా సమ్మిళిత వృద్ధిని సాధించిందని చెబుతూ వారసత్వం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ దశాబ్దాల నాటి అడ్డంకులను తొలగించామని రాష్ట్రపతి చెప్పారు.
“మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతిని నిర్వహించుకున్నాం. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత వంటి అంశాల్లో ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులు చరిత్రాత్మకమైన కృషి చేశారు. వారి స్ఫూర్తితోనే అణగారిన వర్గాల అభివృద్ధికి ఈమధ్య ప్రాధాన్యం ఇస్తున్నాం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం” అని ఆమె గుర్తు చేశారు.
78 సౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందికి 13 మరణానంతర పురస్కారాలతో సహా మొత్తం 78 సౌర్య పురస్కారాలకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. వీటిలో 7 మరణానంతర పురస్కారాలతో సహా 9 కీర్తి చక్రలు; 1 ‘బార్ టు శౌర్య చక్ర’; 1 మరణానంతర పురస్కారంతో సహా 19 శౌర్య చక్రలు; 5 ‘బార్ టు సేనా మెడల్స్’; 5 మరణానంతర పురస్కారాలతో సహా 36 సేనా మెడల్స్ (వీరత్వం); 3 నౌ సేనా మెడల్స్ (వీరత్వం); 5 వాయు సేనా మెడల్స్ (వీరత్వం) ఉన్నాయి.
More Stories
స్మార్ట్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ల ఫోటోలపై దుమారం
చైనాను కాకుండా పాక్ నే అతిపెద్ద ముప్పుగా చూస్తున్న భారతీయులు
సింధు నదీ జలాల ఒప్పందం రద్దు సమర్ధించిన ఒమర్ అబ్దుల్లా