మేఘాలయలోని అధికార కూటమిలో రాజకీయ సమీకరణలు మారాయి. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో యూడీపీ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా సమక్షంలో శాసనసభ్యులైన లాఖ్‌మెన్ రింబుయ్ (అమ్లారెమ్), మాజీ మంత్రి కిర్మెన్ షిల్లా (ఖ్లీహ్రియత్), ఓలన్ సింగ్ సుయిన్ (మావ్‌సిన్‌రామ్), మాథ్యూ బియాండ్‌స్టార్ కుర్బా (మావ్‌ఫ్లాంగ్), మైరల్‌బోర్న్ సియెమ్ (నాంగ్‌పో), పియస్ మార్వీన్ (రానికోర్), సిన్‌షార్ థాబా (సోహియాంగ్), బాలాజీద్ సిన్‌రెమ్ (షెల్లా) ఆ పార్టీలో చేరారు.
60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని అధికార కూటమిలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి 26 మంది, యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ)కు 11 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి కేవలం ఇద్దరు మాత్రమే శాసన సభ్యులున్నారు.
తాజాగా 8 మంది యూడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 10కి చేరింది. మేఘాలయలో రెండో అతిపెద్ద పార్టీగా అది అవతరించింది. అధికార కూటమిలో రాజకీయ సమీకరణలు మారడంతో 2028 అసెంబ్లీ ఎన్నికలపై ఇది ప్రభావం చూపే అవకాశమున్నది.

More Stories
‘ఓట్ల చోరీ’ ఆరోపణలను తిరస్కరించిన బిజెపి
ఒడిశా..పునరుడేశ్వరి, తమిళనాడు..రాంమాధవ్, తెలంగాణ.. బన్సల్
ఈసీలో ఎస్ఐఆర్ పై `అసమ్మతి’లేదు, `భిన్నాభిప్రాయాలు’ సహజం!