నెటిజన్ల నిరసనతో బెంగళూరులో పాక్ ప్రదర్శనలు రద్దు

బెంగుళూరులో రెండు వేర్వేరు వేదికలపై నవంబర్ 28, డిసెంబర్ 5లలో జరగాల్సిన పాకిస్తాన్ ‘దార్-ఎ-నిజాత్’ ప్రదర్శనలు నెటిజన్ల నుండి తీవ్రమైన నిరసనలు వెల్లడి కావడంతో రద్దు చేసుకున్నారు. ఆ రెండు ప్రదర్శనల ఆహ్వానాలలోనూ పాకిస్తానీ దుస్తులను డ్రెస్ కోడ్‌గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో నిర్వాహకులు వెనకడుగు వేశారు. 
 
నవంబర్ 28 కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు షీష్ కబాబ్ ప్రతినిధి ధృవీకరించారు. కానీ ఆ నిర్ణయానికి గల కారణాన్ని వివరించలేదు. డిసెంబర్ 5 ప్రదర్శన నిర్వాహకుడు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కుటుంబ సభ్యులు,  కొద్దిమంది పరిచయస్తుల కోసం ఉద్దేశించినదని చెప్పారు. “మేము ఈ కార్యక్రమాన్ని రద్దు చేశాము. ఇది కుటుంబం, సన్నిహితుల కోసం ఉద్దేశించినప్పటికీ, ఇది ఒక సమస్యగా మారినందున, మేము ప్రదర్శనను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము,” అని ఒక ప్రతినిధి విలేకరులతో పేర్కొన్నారు. 
 
ఎక్స్ లో ఒక పోస్ట్ ఈ కార్యక్రమాలను ప్రశ్నిస్తూ, జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. ఆ పోస్ట్ ప్రతిపాదిత డ్రెస్ కోడ్‌ను, ఈ సమావేశాల ద్వారా పాకిస్తానీ టెలివిజన్ కంటెంట్‌ను ప్రోత్సహించడాన్ని వ్యతిరేకించింది. మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ ఆర్. హితేంద్ర, ఎలాంటి చర్య తీసుకునే ముందు నిర్వాహకుల నుండి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. 
 
“దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మేము నిర్వాహకులను సంప్రదిస్తున్నాము. క్షేత్రస్థాయిలో ఏమైనా చేయాల్సి ఉంటే, అది చేస్తాము,” అని ఆయన తెలిపారు. తరువాత, ఏ నిర్వాహకుడు కూడా ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని హెచ్చరించారు. 
 
ఎక్స్ లో వచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ, పులకేశినగర్ పోలీసులు స్క్రీనింగ్‌లు రద్దు చేసిన్నల్టు తెలిపారు. “షోలు రద్దు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించిన ఏ సమాచారం అయినా సంతోషంగా స్వీకరిస్తాము,” అని పోలీసులు తెలిపారు. తూర్పు బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్‌లో ఉన్న షీష్ కబాబ్‌లో ‘ది బ్లూమ్ సొసైటీ సిస్టర్స్ క్లబ్’ వారు మొదటి సమావేశాన్ని ప్లాన్ చేశారు. 
 
నిర్వాహకులు 34, 35 అనే రెండు ఎపిసోడ్‌ల స్క్రీనింగ్‌తో పాటు, పర్షియన్, అరబిక్ డిన్నర్‌ను కూడా ప్రకటించారు. టిక్కెట్ల ధర రూ.1,999గా నిర్ణయించారు. జయమహల్ ఎక్స్‌టెన్షన్‌లోని మోవీ ప్రైవేట్ థియేటర్‌లో ‘ది స్టార్ క్లబ్’ నిర్వహించిన రెండవ ఈవెంట్‌ను కూడా ప్రైవేట్ స్క్రీనింగ్‌గానే పేర్కొన్నారు.
 

 

About The Author