* తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే ఇండియా కూటమి దుష్ట ఆలోచన… బిజెపి
తమిళనాడులో కార్తీక దీపం వివాదాన్ని ‘ఇండియా’ కూటమికి ఒక పెద్ద రాజకీయ సవాలుగా పరిణమించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం, దీప ప్రజ్వలనపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆ ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీలను బిజెపి లక్ష్యంగా చేసుకుంది.
మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ అనే రాతి స్తంభం వద్ద, నవంబర్ 24న కొన్ని పరిమితులకు లోబడి, ఒక్కసారి మాత్రమే కార్తీక దీపం వెలిగించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 20న ఇచ్చిన ఉత్తర్వును తమిళనాడు ప్రభుత్వం ధిక్కరించిందని బీజేపీ అధికార ప్రతినిధి సుదాన్షు త్రివేది ఆరోపించారు.
హజ్రత్ సుల్తాన్ సికందర్ బదుషా ఔలియా దర్గా సమీపంలోని వివాదాస్పద స్తంభం వద్ద కాకుండా, సాంప్రదాయ ప్రదేశమైన ఉచిపిల్లయార్ ఆలయం వద్ద దీపాన్ని వెలిగించారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ జేబులో పెట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు, రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించడానికి సిద్ధంగా లేరని త్రివేది ఎద్దేవా చేశారు.
మత సామరస్యం, శాంతిభద్రతలపై ఆందోళనలను ఉటంకిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వును సమీక్షించాలని ప్రభుత్వం కోరింది. త్రివేది కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ, తరచుగా రాజ్యాంగ విలువలను ప్రస్తావించే ఆ పార్టీ, సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయనందుకు తన తమిళనాడు మిత్రపక్షాన్ని జవాబుదారీగా ఉంచుతుందా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఈ ఉదంతాన్ని, సనాతన ధర్మం పట్ల ‘ఇండియా బ్లాక్’కు ఉన్న శత్రుత్వానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
హిందూ మత ఆచారాలను బలహీనపరిచేందుకు ఇదొక పెద్ద రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు. ఈ వివాదానికి జాతీయ రాజకీయ కోణాన్ని కల్పించే ప్రయత్నంలో, త్రివేది షా బానో ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, దీపం వివాదం కూడా కాంగ్రెస్‌కు అలాంటి మరో సందర్భం కావచ్చని సూచించారు. దీపావళి ఉత్సవాల సందర్భంగా కంచి శంకరాచార్యుల అరెస్టును విమర్శిస్తూ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ది కోయలిషన్ ఎరా’ పుస్తకాన్ని ఆయన ఉటంకించారు.
ఇతర వర్గాల మత ఆచారాలపై ఆంక్షలను అదే బలంతో వ్యతిరేకిస్తుందో లేదో నిరూపించుకోవాలని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. తన ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ చర్చిలలో భక్తిభావాలను వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ, మతపరమైన మనోభావాలకు పక్షపాత ధోరణి చూపుతున్నారని ఆరోపిస్తూ, లౌకికవాదంపై ఇండియా కూటమి చేస్తున్న పరస్పర విరుద్ధమైన వాదనలను కూడా బీజేపీ అధికార ప్రతినిధి ప్రశ్నించారు.
తక్షణ వివాదానికి అతీతంగా, తమిళనాడులో దేవాలయాలు, వక్ఫ్ బోర్డు, మతపరమైన ఆస్తులకు సంబంధించిన గత వివాదాలను త్రివేది ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఒక నిరంతర ధోరణిని ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. చట్టపరమైన చర్యల ద్వారా దీపాలు వెలిగించాలనే డిమాండ్‌ను వ్యతిరేకించడంలో హిందూ మత, ధార్మిక దానాల శాఖ పాత్రను కూడా ఆయన ప్రశ్నించారు.
విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంటూ, తన జాతీయ ప్రతిపక్ష నినాదాన్ని కొనసాగించాలని చూస్తున్న తరుణంలో, ఇండియా కూటమికి రాజకీయంగా సున్నితమైన సమయంలో ఈ జోక్యం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, షా బానో ఉదంతాన్ని గుర్తుచేయడం ద్వారా, విస్తృత మతపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులున్న ఈ విషయంలో ఒక మిత్రపక్షం చర్యలను సమర్థించుకోవాల్సిన స్థితిలో కాంగ్రెస్‌ను నిలబెట్టడానికి బీజేపీ ప్రయత్నించింది.
కోర్టు ధిక్కార చర్య తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే ఇండియా కూటమి దుష్ట ఆలోచనతో ప్రేరేపించినదే అని పేర్కొంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా హిందుత్వాన్ని అంతం చేయాలనే అంతర్జాతీయ దుష్ట కుట్రతో చేసిన ప్రణాళికలో భాగమే అని ఆరోపించారు.
“కేరళలో తాము పొత్తులో ఉన్న ముస్లిం లీగ్ ప్రభావంతోనో లేక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీపై ఒత్తిడి తెచ్చి, తమను మరింత పెద్ద హిందూ వ్యతిరేకులుగా, ఛాందసవాద ముస్లింల ప్రతినిధులుగా చూపించుకోవడానికి చేశారా? అనేది ఏదైనా కావచ్చు. వారు తీసుకున్నప్రమాదకరమైన నిర్ణయం వల్ల, ఇప్పుడు దీనిని కాంగ్రెస్ పార్టీకి రెండో షా బానో ఘటనగా చెప్పొచ్చు” అని స్పష్టం చేశారు.

More Stories
పాకిస్థాన్‌ను భారత్‌కు సైనిక పీడకలగా మార్చే చైనా యత్నం!
నెటిజన్ల నిరసనతో బెంగళూరులో పాక్ ప్రదర్శనలు రద్దు
ఐసీసీ టాప్-10లో ముగ్గురు భారత్ బ్యాటర్లు