ఐరోపా దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలలో పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో రెండు దేశాలతో ఉన్న వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్, స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఆహ్వానం మేరు ఈ రెండు దేశాలు పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో జరిగే జీ7 దేశాల సదస్సులో కడా పాల్గొంటారు. తన ప్రయాణానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో మోదీ, ఫ్రాన్స్ భారత్ వ్యూహాత్మక దృష్టిలో ప్రత్యేక స్థానం కలిగి ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలు గతంలో మరింత బలపడినట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో భారత్ పర్యటన చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇరుదేశాలు ‘స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ దశకు చేరుకున్నాయని ఆయన చెప్పారు.
జూన్ 14న ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని తెలిపారు. భారత్–ఫ్రాన్స్ ఇన్నోవేషన్ సంవత్సరానికి అనుగుణంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ వేదిక ద్వారా భారత్‌లోని అత్యుత్తమ స్టార్టప్‌లకు అంతర్జాతీయ పెట్టుబడిదారులతో నేరుగా అనుసంధానం కల్పించబడుతుంది. భారత ఉన్నత విద్యా వ్యవస్థ నుంచి వెలువడుతున్న ఆవిష్కరణలను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లే ప్రధాన వేదికగా ఇది మారనుందని ఆయన పేర్కొన్నారు.
1993 తర్వాత భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించనుండటం ఇదే మొదటిసారి. 14, 15 తేదీల్లో మోదీ స్లోవేకియాలో పర్యటిస్తారు. అక్కడి అధ్యక్షుడు పీటర్ పల్లెగ్రినితోపాటు ప్రధాని రాబర్ట్ ఫికోతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించి, పలు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనంతరం ఫ్రాన్స్ చేరుకుంటారు.
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు మరింత వేగం పుంజుకోనున్నాయని పేర్కొంటూ స్లోవేకియా ఈయూలో కీలక సభ్యదేశంగా ఉండటంతో ఈ పర్యటన వ్యూహాత్మకంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని ప్రధాని తెలిపారు. భారత్-ఈయూ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
16, 17 తేదీల్లో ఫ్రాన్స్‌లోని ఈవియన్‌లో జరిగే జీ7 దేశాల సదస్సుకు హాజరవుతారు. అనంతరం 18వ తేదీన ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరిగే వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మ్యాక్రోన్‌తో సమావేశమవుతారు. రెండు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, టెక్నాలజీ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు. అనంతరం రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రెండు దేశాల మధ్య స్టార్టప్‌లపై, పెట్టుబడులపై కీలక ఒప్పందాలు జరుగుతాయి.

More Stories
రెండు రోజుల్లో రెండోసారి అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
రాజ్యసభకు 24 మంది ఏకగ్రీవం.. మూడు సీట్లకు ఎన్నిక
మమతా రాజకీయ ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ లు