భారత ఆర్మీ నూతన చీఫ్‌గా ధీరజ్‌ సేత్

భారత ఆర్మీ నూతన చీఫ్‌గా ధీరజ్‌ సేత్

భారత సైన్యంలో అత్యున్నత పదవి అయిన ఆర్మీ చీఫ్‌ గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో 2026 జూన్ 30 నుంచి ధీరజ్ సేథ్ భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది.  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన పదవీకాలం ఆగస్టు 31 2028 వరకు కొనసాగనుంది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేస్తున్న ధీరజ్ సేథ్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక సేవా అనుభవం ఉంది. ఖడక్‌వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఆయన 1986లో ఆర్మర్డ్ కార్ప్స్ అధికారిగా భారత సైన్యంలో చేరారు. 

అప్పటి నుంచి వివిధ కీలక కమాండ్, స్టాఫ్, వ్యూహాత్మక బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు.  1997లో 20 లాన్సర్స్ విభాగానికి చెందిన జనరల్ శంకర్ రాయ్ చౌదరి పదవీ విరమణ చేసిన తర్వాత, సుమారు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఆర్మీ చీఫ్ పదవిని చేపడుతున్న మొట్టమొదటి ఆర్మర్డ్ కార్ప్స్ రక్షణ అధికారిగా ఆయన నూతన రికార్డు సృష్టించబోతున్నారు.

సైనిక విద్యలోనూ ఆయనకు విశేష అనుభవం ఉంది. ఫ్రాన్స్‌లోని పారిస్ మిలిటరీ కాలేజీలో డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ జనరల్ స్టాఫ్ కోర్సు పూర్తిచేశారు. అదేవిధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న నావల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కూల్‌లో ఇంటర్నేషనల్ డిఫెన్స్ అక్విజిషన్ మేనేజ్‌మెంట్ కోర్సులో శిక్షణ పొందారు. 

ధీరజ్ సేథ్ ఎడారి ప్రాంతాల్లో సాయుధ రెజిమెంట్‌కు, అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సాయుధ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. జమ్మూ-కాశ్మీర్‌లో తిరుగుబాటు నిరోధక దళానికి కమాండర్‌గా సేవలందించారు. అనంతరం సుదర్శన్ చక్ర కార్ప్స్‌కు నాయకత్వం వహించి ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా కీలక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

గత ఏడాది నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో పూణే కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్‌కు ఆయన నాయకత్వం వహించారు. అనంతరం పశ్చిమ సరిహద్దు వెంబడి నిర్వహించిన త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలను సమన్వయం చేశారు. అంగోలాలోని ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతా మిషన్‌లోనూ ఆయన సేవలందించారు.