
అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం కీలక సూచనలు చేసింది.
ఎలాంటి అనుమానాలు వచ్చినా దేశం నుంచి బహిష్కరిస్తున్నారు. హమాస్‌తో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఇటీవలే భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిపై అమెరికా బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మరో విద్యార్థిని రంజిని శ్రీనివాసన్‌ను కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు ఆయా దేశాల విచక్షణాధికారాలకు సంబంధించినవని, వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అమెరికా చట్టాలకు లోబడి అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు ఉండాలని కేంద్రం సూచించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది.
ఎంబసీ, కాన్నులేట్ కార్యాలయాలు విద్యార్థులు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశీయులు మన దేశానికి వచ్చినప్పుడు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం భావిస్తామని, అదే విధంగా మన పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయా దేశాల చట్టాలు, నిబంధనలను పాటించాలని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు.
చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీలకు, యూనివర్శిటీలకు ఫెడరల్ నిధులను నిలిపివేస్తామని, ఆందోళనలకు పాల్పడేవారిని జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుందని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం