భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో ఎక్స్ స‌వాల్

భార‌త ప్ర‌భుత్వాన్ని కోర్టులో ఎక్స్ స‌వాల్
 
బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన ఎక్స్ సోష‌ల్ మీడియా సంస్థ భార‌త స‌ర్కారుపై కోర్టులో దావా దాఖ‌లు చేసింది. క‌ర్నాట‌క హైకోర్టులో ఆ కేసును దాఖలు చేసింది. భార‌త ప్ర‌భుత్వం అక్ర‌మ రీతిలో కాంటెంట్‌ను నియంత్రిస్తున్న‌ద‌ని, సెన్సార్‌షిప్‌కు పాల్ప‌డుతున్న‌ట్లు ఆ దావాలో ఎక్స్ సంస్థ ఆరోపించింది. భార‌త స‌ర్కారు ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టాన్ని వాడుతున్న తీరుపై ఎక్స్ సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. 
 
ఐటీ చ‌ట్టంలోని 79(3)(బీ) సెక్ష‌న్‌ను భార‌త ప్ర‌భుత్వం అక్ర‌మ‌రీతిలో వినియోగిస్తున్న‌ట్లు ఎక్స్ ఆరోపించింది. ఆ సెక్ష‌న్ అమ‌లు సుప్రీంకోర్టు ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘిస్తున్న‌ట్లు ఎక్స్ త‌న దావాలో పేర్కొన్న‌ది. ఆ సెక్ష‌న్ ద్వారా ఆన్‌లైన్‌లో భావ‌స్వేచ్ఛ‌ను అడ్డుకుంటున్న‌ట్లు ఎక్స్ ఆరోపించింది.
79(3)(బీ) సెక్ష‌న్‌ను ప్ర‌భుత్వం దుర్వినియోగంచేస్తున్న‌ట్లు ఎక్స్ సంస్థ తెలిపింది. ఆ సెక్ష‌న్ ద్వారా స‌హ‌యోగ్ పోర్ట‌ల్‌ను స‌మాంత‌రంగా న‌డ‌పాల‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్న‌ది. సెక్ష‌న్ 69ఏను ఉల్లంఘిస్తూ ప్ర‌భుత్వం కాంటెంట్ బ్లాకింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తున్న‌ద‌ని ఎక్స్ ఆరోపించింది. 2015లో శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కేంద్రం ఉల్లంఘిస్తున్న‌ట్లు ఎక్స్ పేర్కొన్న‌ది. 
 
కాంటెంట్‌ను బ్లాక్ చేయాలంటే అది న్యాయ ప్ర‌క్రియ ద్వారా జ‌ర‌గాల‌ని, లేదంటే 69ఏ సెక్ష‌న్ ప్ర‌కారం జ‌ర‌గాల‌ని ఎక్స్ తెలిపింది. సెక్ష‌న్ 79 ప్ర‌కారం ఏదైనా అక్ర‌మ కాంటెంట్ ఉంటే.. కోర్టు ఆదేశాలు లేదా ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఆన్‌లైన్ సంస్థలు ఆ కాంటెంట్‌ను తీసివేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ 36 గంట‌ల్లో ఆన్‌లైన్ సంస్థ ఆ కాంటెంట్‌ను తీయ‌లేని ప‌క్షంలో  ఆ సంస్థ ఐపీసీ చ‌ట్టాల ప్ర‌కారం న్యాయ విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌స్తోంద‌ని ఎక్స్ త‌న పిటీష‌న్‌లో తెలిపింది.