
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు.
బీజాపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. బీజాపుర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా.. ఇరువర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమైనట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు. బీజాపుర్ ఎదురుకాల్పుల్లో ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్ పోలీసులు పేర్కొన్నారు.
బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను తరలించామని ఎస్‌పి జితేంద్రయాదవ్ తెలిపారు. భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు తొలుత కాల్పులు జరపాని, దీంతో భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని వివరించారు.
ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు పారిపోయారని వెల్లడించారు. ఘటనా స్థలంలో మందు గుండు సామాగ్రి, ఎకె 47, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నారాయణపూర్ జిల్లాలో ఐఇడి పేలడంతో ఒక జవాన్ గాయపడినట్టు సమాచారం.
మరోవైపు కాంకేర్ జిల్లాలోనూ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. డీఆర్‌జీ, జీఎస్‌ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో నలుగురు మావోలు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. మొత్తం రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 24 మంది మావోలు హతమైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
వక్ఫ్ సవాల్ చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరిన కేంద్రం