మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి

మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణలో ఒకరు మృతి
మణిపూర్‌లో చురాచంద్‌పూర్‌ జిల్లాలో హమర్‌, జోమీ తెగల మధ్య జరిగిన ఘర్షణలో   ఒక వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని చురచంద్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
 
చురాచంద్‌పూర్‌ జిల్లాలో మంగళవారం రాత్రి జోమి కౌన్సిల్‌ మరియు హ్మార్‌ ఇన్పురు తెగల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన కొన్నిగంటల తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. జోమి సంస్థకు చెందిన జెండాను కొందరు దుండగులు కూల్చివేసేందుకు యత్నించారు. ఆగ్రహించిన జోమి వర్గం హ్మార్‌ వర్గంపై కర్రలతో దాడికి దిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థులపై కాల్పులు జరపడంతో పాటు ఆస్తులను కూడా ధ్వంసం చేశాయని సీనియర్‌ అధికారి తెలిపారు. ఇరు వర్గాలను నియంత్రించేందుకు భద్రతా దళాలు గాల్లోకి కాల్పులు జరిపాయని పేర్కొన్నారు. అయితే ఎవరు ఎవరిపై  కాల్పులు జరిపారో స్పష్టంగా తెలియలేదని చెప్పారు. జోమి స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చింది.
 
ఈ నేపథ్యంలో జోమి, హరమ్‌ తెగలకు చెందిన వారు గుంపులుగా చేరుకొని  పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. సాయుధులైన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణలో 53 ఏళ్ల వ్యక్తి మరణించాడు. పలువురు గాయపడ్డారు.  కాగా, ఘర్షణ గురించి తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. మరోవైపు ఆదివారం హమర్‌ నేతను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హమర్, జోమీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగాయి. అయితే రెండు తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు సంస్థలు శాంతి అవగాహనకు వచ్చాయి. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరోసారి ఘర్షణ జరిగింది.