గాజాలో పరిస్థితిపై భారత్ ఆందోళన

గాజాలో పరిస్థితిపై భారత్ ఆందోళన

గాజాలో పరిస్థితిపై తాను ఆందోళన చెందుతున్నట్లు భారత్ బుధవారం వెల్లడించింది. బాధితులకు మానవతా సాయం అందజేయాలని భారత్ పిలుపు ఇచ్చింది. కల్లోలిత పాలస్తీనా భూభాగంపై ఇజ్రాయెల్ బాంబు దాడులను తిరిగి ప్రారంభించడంతో హమాస్‌త కాల్పుల విరమణ ఒప్పందం అమలు సందేహాస్పదంగా మారింది.

హమాస్ తమ వద్ద ఉన్న బందీలు అందరినీ విడుదల చేయడం అవసరమని కూడా భారత్ స్పష్టం చేసింది. “గాజాలో పరిస్థితి పట్ల మేము ఆందోళన చెందుతున్నాం. అందరు బందీలను విడుదల చేయడం ప్రధానం” అని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) పేర్కొన్నది. “గాజా ప్రజలకు మానవతా సాయం కొనసాగించాలని కూడా పిలుపు ఇస్తున్నాం” అని ఎంఇఎ ఒక ప్రకటనలో తెలిపింది. 

”గాజాలో నెలకొన్న పరిస్థితిపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి ప్రజలకు నిరంతరం మానవతా సాయం కొనసాగాల్సిందిగా కోరుతున్నాం. చెరలో బందీలుగా ఉన్న వారందరినీ విడిచిపెట్టడం ముఖ్యం” అని  భారత్ పిలుపునిచ్చింది.

ఇజ్రాయెల్ మంగళవారం గాజాలో హమాస్ లక్షాలపై బాంబు దాడులు జరిపిన నేపథ్యంలో భారత్ ఆ వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ తాజా దాడులతో జనవరి 19న అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వశాఖ సమాచారం ప్రకారం ఇజ్రాయెలీ బాంబు దాడుల్లో 400 మందికి పైగా మరణించారు. 

కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రాథమిక దశ నుంచి ఎలా ముందుకు సాగాలో ఇజ్రాయెల్, హమాస్ తేల్చుకోలేకపోవడంతో ఇజ్రాయెల్ తాజా దాడులకు దిగింది. ఆ ఒప్పందం మూడు దశలుగా సాగాల్సి ఉంది. ఒప్పందం రెండవ దశపై సంప్రదింపులు సుమారు ఆరు వారాల క్రితమే ప్రారంభం కావలసి ఉన్నది. కానీ రెండు పక్షాలు చర్చలు జరపలేకపోయాయి. కాగా, తాము ‘కీలక లక్షాలు’ సాధించేంత వరకు తమ దేశం ‘తగ్గబోదు’ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.

మరోవంక, ఉత్తర గాజాపై ఇజ్రాయెల్‌ బలగాల వైమానిక దాడులు రెండో రోజు బుధవారం కొనసాగాయి. ఈ దాడుల్లో గాజా సిటీలో ముగ్గురు, బీట్‌ హనోన్‌లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. గాజా కారిడార్‌లో అత్యంత కీలకమైన కొంతభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి పరిమితస్థాయి ‘గ్రౌండ్‌ ఆపరేషన్‌’ చేపట్టినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. బందీలను హమాస్‌ విడిచిపెట్టకపోతే, ఊహించలేని స్థాయిలో దాడులు ఉంటాయని ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి హెచ్చరించారు.