పంజాబ్ రాష్ట్రంలోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరుపుతామని ఆ ఈ-మెయిల్స్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ఆలయాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. కాగా మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూ స్టార్ కు 42 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం పంజాబీల్లో ఆందోళన కలిగిస్తోంది.
బాంబు బెదిరింపు మెయిల్స్‌లో పేర్కొన్న ఆలయాల్లో అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్ ధామ్ ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్ మందిర్, భటిండాలోని మైసర్ ఖానా ఆలయం, పటియాలాలోని మాతాకాళీ ఆలయం ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఆపరేషన్ బ్లూస్టార్ కు 42 ఏళ్లు కావొస్తుండటంతో ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ బెదిరింపు మెయిల్‌తో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇప్పటికే దేవీ తలాబ్ ఆలయం వద్ద తనిఖీలు పూర్తయ్యాయని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రజలను భయపెట్టే ఉద్దేశంతో చేసిన నకిలీ బెదిరింపులుగా కనిపిస్తున్నప్పటికీ తాము ఎలాంటి రిస్క్ తీసుకోబోమని చెప్పారు. కాగా, 1984 జూన్‌లో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా గోల్డెన్ టెంపుల్‌లో నక్కిన తీవ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం సైనిక చర్య చేపట్టింది.
మేజర్ జనరల్ బ్రార్ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా నిలిచింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83 మంది భారత సైనికులు అమరులయ్యారు. వేర్పాటువాద నేత భింద్రన్ వాలేతో పాటు ఇతర వేర్పాటువాద నేతలూ హతమయ్యారు.

More Stories
భారత్ లో ముగ్గురు ఎబోలా వైరస్ అనుమానితులు
భారత్‌కు చేరిన నాలుగవ ఎస్-400 మిస్సైల్ సిస్టమ్
ఉత్తరాఖండ్‌లో సోషల్ మీడియా ద్వారా పాక్ ఉగ్ర నెట్వర్క్!