భారత్ లో ముగ్గురు ఎబోలా వైరస్ అనుమానితులు

భారత్ లో ముగ్గురు ఎబోలా వైరస్ అనుమానితులు

* ఎబోలా ల‌క్ష‌ణాల‌తో శంషాబాద్‌కు సుడాన్ వ్య‌క్తి 

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఆందోళనల నేపథ్యంలో భారత్లోనూ వైరస్ కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఎబోలా వైరస్‌ అనుమానితులను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కాంగో, ఇథియోపియా, ఉగాండా దేశాల నుంచి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల ఆచూకీని గుర్తింపు, వారి పర్యవేక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. 
 
కేంద్ర సంస్థల నుంచి అందిన హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అయితే, ఇప్పటివరకు వారిలో ఎవరికీ ఎబోలా సోకినట్లు నిర్ధారణ కాలేదని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ ముగ్గురు వ్యక్తులను గృహ నిర్బంధంలోనే వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొంది.

మరోవంక, ఎబోలా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న సుడాన్ ప్ర‌యాణికుడు ఒక‌రు గురువారం శంషాబాద్ విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. వైర‌స్ ల‌క్ష‌ణ‌లు క‌నిపించ‌డంతో అత‌న్ని త‌క్ష‌ణ‌మే న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఎమ‌ర్జెన్సీ ప్రణాళిక ప్ర‌కారం సుడాన్ వ్య‌క్తిని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. గాంధీ ఆస్ప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డులో అత‌నికి చికిత్స కొన‌సాగిస్తున్నారు. 

ఎబోలా మేనేజ్మెంట్ కోసం తెలంగాణ‌లో గాంధీ ఆస్ప‌త్రిని నోడ‌ల్ సెంట‌ర్‌గా గుర్తించారు. ఇక్క‌డ ప్ర‌త్యేక‌మైన ఐసోలేష‌న్ వ‌స‌తులు ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో అంత‌ర్జాతీయ ప్ర‌యాణికుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో సుడాన్ ప్ర‌యాణికుడికి జ్వ‌రం ఉన్న‌ట్లు గుర్తించారు. ప్ర‌స్తుతానికి ఎబోలా ఉన్న‌ట్లు నిర్ధార‌ణ కాలేదు. కానీ అత‌ని ట్రావెల్ హిస్ట‌రీ కార‌ణంగా .. అనుమానంతో శ్యాంపిళ్ల‌ను టెస్టింగ్‌కు పంపిన‌ట్లు అధికారులు చెప్పారు.

ఇదిలా ఉండగా కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినా లేదా ఆ దేశాల మీదుగా వచ్చిన ప్రయాణికులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మంగళవారం ఓ ప్రకటన చేసింది. 

భారత్‌లో ఇప్పటివరకు ఎబోలా కేసులు ఏవీ నిర్ధరణ కాలేదని స్పష్టత ఇచ్చింది. ఎవరైనా గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశం నుంచి వచ్చినా, లేదా ఆ దేశం మీదుగా ప్రయాణించినా జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని చెప్పింది. వెంటనే ఆరోగ్య అధికారులకు సమాచారం అందించాలని పేర్కొంది. ముందస్తు సమాచారంతో మీ ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాధి వ్యాప్తిని కూడా నిరోధించవచ్చని వివరించింది. ఈ సందర్భంగా అధికారుల సాయం కోసం 1075 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని వివరించింది.