
తెలంగాణలో చేపట్టిన కులగణన సమాచారాన్ని విశ్లేషించడానికి ఏర్పాటయిన నిపుణుల బృందంలో ఫ్రెంచి ఆర్థికశాస్త్రవేత్త థామస్ పికెట్టీని నియమించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కీలకమైన సామాజిక సమాచారాన్ని విదేశీయులకు ఎలా అందుబాటులో ఉంచుతారని ప్రశ్నించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సుధాంశు త్రివేది ఢిల్లీలో మాట్లాడుతూ దేశంలో చాలా మంది నిపుణులు ఉండగా, విదేశీ ఆర్థికశాస్త్రవేత్తను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నియమించిందని ప్రశ్నించారు. ఎంతమంది భారతీయులు ఎన్నో విదేశీ సంస్థలకు ఆధిపత్యం వహిస్తుండగా, ఒక విదేశీయుడ్ని నియమించాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు.
సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటయిన 11 మంది సభ్యుల కమిటీలో పికెట్టీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఆర్థిక అసమానతలపై విస్తృతంగా పరిశోధనలు చేశారు. పన్నుల విధానంపై ఆయన చేసిన సూచనలు ఉద్యోగులు, మధ్యతరగతి వారికి హాని కలిగించేవిగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయని త్రివేది గుర్తు చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థపై విమర్శలు చేస్తున్న విదేశీ శక్తులతో కాంగ్రెస్ చేతులు కలుపుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ భారత్‌లో మంచేమీ లేదని చెప్పడం కాంగ్రె్‌సకు అలవాటేనని ఎద్దేవా చేశారు. భారత్ సొంతంగా పరిపాలించుకోలేదు, సొంతంగా ఆలోచించుకోలేదు, సొంతంగా రక్షించుకోలేదన్నదే కాంగ్రెస్ ఉద్దేశమని ఆయన విమర్శించారు. సున్నితమైన జనాభా సమాచారంపై విదేశీయులు వారి అవసరాలకు అనుగుణంగా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం