ఎన్నో ఉద్యమాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో ఆందోళనలపై నిషేధం విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులపై ఆనాటి పాలకులు ఊరూరా ఉక్కుపాదం మోపుతున్న తరుణంలోనూ ఓయూ విద్యార్థి ఉద్యమంపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదు.
కానీ, నేడు ‘ప్రతికూల ప్రభావం’ అంటూ సాకుగా చూపి రేవంత్ సర్కారు అణచివేత చర్యలకు దిగింది. వర్సిటీలో అన్నిరకాల ధర్నాలు, నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ శనివారం ఓయూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత ఉస్మానియాపై ఇలాంటి నిషేధాజ్ఞలు విధించడం విపరిణామమే.
వర్సిటీ అధికారుల ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాల నేతలు, విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, దాని విభాగాలు, కళాశాలలు, కేంద్రాలు, పరిపాలనా భవనాల్లో ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు నిషేధిస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్‌రెడ్డి ఈ సర్క్యులర్ జారీచేశారు. నిరసనలు యూనివర్సిటీ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపడంతోపాటు పరిపాలన, విద్యా పురోగతిని జాప్యంచేసే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
కొన్ని సందర్భాల్లో భద్రతా సమస్యలు సైతం తలెత్తాయని తెలిపారు. వర్సిటీ భవనాల్లోకి అనధికారికంగా ప్రవేశించడం, ధర్నాలు, ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిరోధించడం, వర్సిటీ ఉద్యోగులు, అధికారులపై అభ్యంతరకరమైన భాషను వినియోగిస్తూ దూషించడాన్ని సంపూర్ణంగా నిషేధించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. యూనివర్సిటీ విద్యార్థులకు ఏదైనా ఫిర్యాదులు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు. కాగా, ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చింది.
వందేమాతరం ఉద్యమంతోపాటు అనేక సామాజిక, రాజకీయ, ప్రజా ఉద్యమాలకు ఈ వర్సిటీ వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సైతం గుండెకాయగా నిలిచింది. అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛను దెబ్బ తీయలేదు. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వర్సిటీ గొంతు నొక్కే కుట్రలకు తెరలేపింది.అధికారంలోకి రాగానే ప్రజాపాలన తెస్తామంటూ గొప్పలు పలికిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే పార్టీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన వర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసమని పలువురు విద్యావేత్తలు, విద్యార్థి నేతలు ప్రశ్నిస్తున్నారు. ముక్తకంఠంతో విద్యార్థి, ప్రజా సంఘాలు దీనిని ఖండించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు.
విద్యార్థుల గొంతులు నొక్కే ఈ ప్రయత్నాన్ని విరమించుకొని, సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అప్రజాస్వామిక, నియంతృత్వ ఆదేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఏనాడూ తలవంచబోదని స్పష్టం చేస్తున్నారు.
“శాంతియుతంగా నిరసన తెలపడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామిక హక్కు. ఔటా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పరిధులకు లోబడి, శాంతియుతంగా ఎవరైనా నిరసనలు తెలుపొచ్చు. ఆందోళనల ద్వారానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సైతం సిద్ధించింది. దానిని అడ్డుకోవడం నియంతృత్వం కిందికే వస్తుంది. తక్షణమే ఈ సర్క్యులర్ణు వెనక్కి తీసుకోవాలి. నిరసనలు తెలుపడం సంఘాల ప్రాథమిక హక్కు. దానిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదు” అని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్ స్పష్టం చేశారు.
“ఓయూ వీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గర్హనీయం. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఉత్తర్వులు జారీచేయడం సిగ్గుచేటు. తక్షణమే దానిని వెనక్కి తీసుకోవాలి. యూనివర్సిటీలో నాణ్యమైన భోజనం, హాస్టల్ వసతి కల్పించేందుకు ప్రయత్నించాలి, కానీ విద్యార్థుల హక్కులను కాలరాయొద్దు” అని ఏఐవిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను