
కృష్ణా నదీ జలాలపై నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి(ఆర్.ఎల్.ఐ.సి) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. ఏపి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మించేందుకు అంతర్ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
గత నెల 27న నిర్వహించిన ఎక్స్ పర్ట్ అప్రైజల్ కమిటీ ఏపీ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తుల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై విడుదల చేసిన మినిట్స్ లో పర్యావరణ అనుమతులు కోరే ముందు అక్కడ ఎలాంటి పనులు చేయలేదని పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెన్నెలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ లో కేసు వేశారు.
ఇందులో ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు తొలిదశకు అనుమతులు అవసరం లేదని వాదించింది. దీంతో రెండో దశ పర్యావరణ అనుమతులకు మాత్రమే దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏపీ ప్రభుత్వం తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దరఖాస్తును తిరస్కరించింది. తద్వారా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిరాకరించింది.
వాస్తవానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ర్మాణం ఏపి ప్రభుత్వం చేపట్టిందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం వద్ద పలు సందర్భాల్లో వాదనలు వినిపించింది.
కృష్ణా జలాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం విజయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణా వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర నిబంధనలను బేఖాతర్ చేస్తున్న ఏపి సర్కారు తీరును తెలంగాణ ప్రభుత్వ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఆధారాలతోసహా అందించి విజయం సాధించారని ఆయన వివరించారు.
More Stories
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్
కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచే ముప్పు
లద్దాఖ్, పీఓకె లేని భారత్ మ్యాప్ వివాదంలో రేవంత్ ప్రభుత్వం