భారతదేశంలో 6 నుండి 23 నెలల వయస్సు గల పిల్లలలో కేవలం 15.3శాతం మంది మంది మాత్రమే తగినంత పోషకాహారం పొందుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ హెచ్ ఎఫ్ ఎస్-6) తెలిపింది. గత సంవత్సరాలతో పోలిస్తే దేశంలో పోషకాహార లోపంలో కొంత మెరుగుదల కనిపించినప్పటికీ, 6-23 నెలల వయస్సు గల పిల్లలలో గణనీయమైన సంఖ్యలో ఇప్పటికీ తగినంత ఆహారం లభించడం లేదు.
ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5లో 11శాతంగా ఉన్న 6-23 నెలల వయస్సు గల పిల్లల నిష్పత్తి, ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -6లో 15.3శాతానికి పెరిగాయని గణాంకాలు తెలిపాయి. పిల్లలకు తగినన్ని కేలరీలు అందుతున్నప్పటికీ, వారి పెరుగుదలకి అవసరమైన ప్రోటీన్లు, సూక్ష్మపోషకాలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తగినంతగా అందడం లేదని నిపుణులు హెచ్చరించారు.
కేవలం తల్లిపాలు మాత్రమే తీసుకునే ఆరు నెలల లోపు పిల్లల సంఖ్య కూడా ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -6లో 55.8 శాతానికి తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5లో వారి సంఖ్య 63.7 శాతంగా ఉండేంది. తల్లిపాలు శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పోషకాలు, యాంటీబాడీలు, హైడ్రేషన్‌ను సరైన సమతుల్యతతో అందిస్తాయి.
అదే సమయంలో, అవి వారి అభివృద్ధి చెందుతున్న జీర్ణ , రోగనిరోధక వ్యవస్థలను ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుండి కాపాడతాయి. కేవలం తల్లిపాలు మాత్రమే ఇచ్చే వారి సంఖ్య తగ్గడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, దీనిపై తక్షణమే జాతీయ స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా (బిపిఎన్ఐ) వ్యవస్థాపకుడు డాక్టర్ అరుణ్ గుప్తా హెచ్చరించారు.
ఇది ప్రజారోగ్యం, పోషణ, బాలల హక్కులు, జాతీయ అభివృద్ధికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు. తల్లులు పిల్లలకు పాలిచ్చేలా వ్యవస్థలను పునర్నిర్మించడానికి భారతదేశం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -6 ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయని డాక్టర్ గుప్తా తెలిపారు. అయితే ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ లో తల్లిపాలతో పాటు ఘనాహారాన్ని పొందుతున్న 6–8 నెలల వయస్సు గల పిల్లల నిష్పత్తి 45.9శాతం నుండి 59.5శాతానికి పెరిగినట్లు గణాంకాలు తెలిపాయి.
ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5 (2019–21), ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -6 (2023–24) మధ్య చేసిన పోలిక ప్రకారం, పిల్లలలో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో భారత్ పురోగతి సాధించినప్పటికీ, సవాళ్లు ఇంకా గణనీయంగానే ఉన్నాయి. ఐదేళ్లలోపు పిల్లలలో వయస్సుకు తగినంత ఎత్తు లేకపోవడం(స్టంటింగ్) ప్రాబల్యం ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ -5లోని 35.5 శాతం నుండి ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-6లో 32.3 శాతం కి తగ్గింది.
తీవ్రమైన పోషకాహార లోపానికి సూచిక అయిన ‘వేస్టింగ్’ (ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం) 19.3 శాతం నుండి 16.3 శాతానికి తగ్గగా, తీవ్రమైన వేస్టింగ్ 7.7శాతం నుండి 5.7శాతానికి తగ్గింది. తక్కువ బరువు ఉన్న పిల్లల (వయస్సుకు తగినంత బరువు లేకపోవడం) నిష్పత్తి కూడా 32.1శాతం నుండి 29.2 శాతానికి తగ్గింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఒ) ప్రకారం, 6–24 నెలల వయస్సు పిల్లల పెరుగుదల, మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైన కాలం. అయితే ఆరు నెలల వయస్సు నుండి, కేవలం తల్లిపాలు మాత్రమే సరిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు రెండేళ్ల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తల్లిపాలు ఇవ్వడాన్ని కొనసాగిస్తూనే, సురక్షితమైన, పోషకాలతోనిండి, వైవిధ్యభరితమైన అనుబంధ ఆహారాలను అందించాలని సూచిస్తున్నారు.

More Stories
రెండోసారి ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆర్సీబీ
భారత భూభాగాలు ఆక్రమించిన నేపాల్… ప్రధాని వ్యాఖ్యలపై దుమారం
పోలీస్ స్టేషన్ వద్ద దాడిలో టిఎంసి ఎంపీ కళ్యాణ్ బెనర్జీకి తల గాయం