భారత భూభాగాలు ఆక్రమించిన నేపాల్… ప్రధాని వ్యాఖ్యలపై దుమారం

భారత భూభాగాలు ఆక్రమించిన నేపాల్… ప్రధాని వ్యాఖ్యలపై దుమారం

నేపాల్, భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొంటూ  భారత్ మాత్రమే కాకుండా నేపాల్ కూడా కొన్ని ప్రాంతాల్లో భారత భూభాగాన్ని ఆక్రమించిందని తాను ఇటీవలే తెలుసుకున్నానని నేపాల్ పార్లమెంట్ లో  ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ దేశ ప్రధాని  బాలేంద్ర షా చేసిన వాఖ్యలు దుమారం రేపాయి. 

“నేను ప్రధానమంత్రి అయిన తర్వాతే ఒక విషయం తెలుసుకున్నాను. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా కొన్ని చోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది. అందువల్ల ఇరు దేశాలు వాస్తవాలను పరిశీలించి స్నేహపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీకి చెందిన బసనా థాపా, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత రమేశ్ మల్లా తదితరులు ప్రధాని వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, లేకుంటే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు.

కాగా,  కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూవివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పార్లమెంట్ సమావేశాల్లో తొలిసారి పాల్గొన్న బాలేంద్ర షా భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. రెండు దేశాలు స్నేహపూర్వకంగా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.

సరిహద్దు వివాదాలపై రాజకీయ వాదోపవాదాలకు బదులుగా చారిత్రక వాస్తవాలు, పాత మ్యాపులు, సర్వే రికార్డులను ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు బాలేంద్ర షా తెలిపారు. ఇందుకోసం చరిత్రకారులు, భూసర్వే నిపుణులు, సంబంధిత రంగాల నిపుణులతో కూడిన బృందాల సహకారం తీసుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు. 

ఈ అంశంపై చైనాతో పాటు బ్రిటన్‌తో కూడా నేపాల్ చర్చలు జరిపినట్లు షా వెల్లడించారు. బ్రిటిష్ పాలన కాలంలో రూపొందిన సరిహద్దు ఒప్పందాలు, మ్యాపులకు ఈ వివాదంతో సంబంధం ఉన్నందున బ్రిటన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు వివరించారు. నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలి కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.