త్రిషపై అసభ్యకర వ్యాఖ్యలు..ఉదయనిధి అరెస్ట్, హైకోర్టులో బెయిల్ 

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషలను ఉద్దేశించి డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అక్క‌డి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు, మంగళవారం ఆయ‌న‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. 
 
తంజావూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై టీవీకే మహిళా వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తంజావూరు పోలీసులు ఐటీ చట్టంలోని నిబంధనలతో సహా మొత్తం ఆరు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయనిధికి రక్షణ కల్పించాలని కోరుతూ డీఎంకే న్యాయవాద బృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 
 
పిటిషనర్‌ను రిమాండ్‌కు తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వకేట్ జనరల్ విజయ నారాయన్ పేర్కొనడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ తర్వాత స్టేషన్ బెయిల్‌పై ఇవాళే ఉదయనిధిని విడిచిపెడతామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు పోలీసుల విచారణకు సహకరించాలన్న షరతుతో ఉదయనిధికి బెయిల్ మంజూరు చేసింది.
 
తంజావూరు డీఎస్పీ అలగేసన్ నేతృత్వంలోని పోలీస్ బృందం, చెన్నై పోలీసు కమిషనర్ ఎ. అమల్‌రాజ్ ఉదయనిధి నివాసానికి చేరుకుని కేసు వివరాలను తెలియజేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో, ఆ ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ డీఎంకే నేతలు కె.ఎన్. నెహ్రూ, మా. సుబ్రమణియన్ తదితరులు అక్కడికి చేరుకుని అధికారులతో చర్చలు జరిపారు.

సోమవారం తంజావూరులోని పనగల్ బిల్డింగ్ వద్ద కావేరి జలాల హక్కులు, మేకెదాటు ప్రాజెక్టు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై జరిగిన డీఎంకే నిరసన సభలో ఉదయనిధి ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలువురు కార్యకర్తలు త్రిష, త్రిష అంటూ నినాదాలు చేశారు. దీంతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన ఉదయనిధి స్టాలిన్‌ అసభ్యకర రీతిలో ద్వంద్వార్థం వచ్చే విధంగా నటి త్రిషపై వ్యాఖ్యలు చేశారు. 

నటి త్రిష పేరును ప్రస్తావించగా, ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీనిపై టీవీకే మహిళా వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే జాతీయ అధికార ప్రతినిధి పళ సెల్వకుమార్ జాతీయ మహిళా కమిషన్‌కు ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు.

అయితే, తనపై వస్తున్న ఆరోపణలను తమిళనాడు ప్రతిపక్షనేత ఉదయనిధి స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తాను అనని మాటలను అన్నట్లు చూపించడానికి ‘కట్, కాపీ, పేస్ట్’ ఎడిటింగ్ పద్ధతులను ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని వ్యాఖ్యానించారు. 

ఇటువంటి బెదిరింపులకు తాను భయపడనని, ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. అలాగే, తన అరెస్టుపై పోలీసుల చర్యను ఒక “కామెడీ”గా అభివర్ణించారు.   కాగా, ఉదయనిధి వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చెన్నైలోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఉదయనిధి క్షమాపణ చెప్పాలని బీజేపీ, టీవీకే నాయకులు డిమాండ్ చేయగా, ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని, అవి ఏ ఒక్క వ్యక్తిని ఉద్దేశించినవి కావని డీఎంకే వాదిస్తోంది. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధికి ఈ గతి పట్టిందని బీజేపీ విమర్శించింది. ఒక మహిళను ఉద్దేశించి అభ్యంతకరంగా మాట్లాడిన మాటలకుగానూ ఆయన అరెస్టయ్యారని బీజేపీ నేత అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. 

మహిళలకు వ్యతిరేకంగా ఇలాంటి మాటలను డీఎంకే అంగీకరించకూడదని బీజేపీ నాయకురాలు తమిళసై సౌందర్​ రాజన్​ పేర్కొన్నారు. మరోవైపు, టీవీకే ఎమ్మెల్యే రేవంత్ చరణ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డీఎంకే నాయకత్వం రాజకీయ చర్చల ప్రమాణాలను దిగజార్చుతోందని ఆరోపించారు.

 
 

 

About The Author