
తెలంగాణాలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేకుల వేసింది. తాము రూపొందించిన యాప్ ద్వారా సర్వే నిర్వహంచకపోవడంతో రాష్ట్రం పంపిన 23 లక్షల లబ్దిదారులను తాము గుర్తించబోమంటూ వార్తమానం పంపింది. కేంద్రం రూపొందించిన గైడ్ లైన్స్ ప్రకారం తిరిగి సర్వే చేసి పంపాలను కోరింది.
రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పీఠముడి బిగుసుకుంది. గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు 30 లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం 23 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా గుర్తించి, జాబితా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణనలోకి తీసుకోబోమని, తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్లీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చిచెప్పింది. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర యాప్‌తో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పనికాదు.
మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధి దారులకు మొదటి విడత సొమ్ము అందజేసేందుకు సిద్ధమైంది. దాదాపు పుష్కర కాలం తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణ పరిధిలో దాదాపు 19 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు. ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది.
ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని, కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది. కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చింది.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస, 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 19.50 లక్షల మంది సొంత జాగా ఉన్నవారుకాగా, మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు.
కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణనలోకి తీసుకుని సర్వే చేశామని, వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని, దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినా కేంద్రం ససేమిరా అంటున్నట్టు తెలిసింది.
దరఖాస్తుల్లో బ్యాంకు ఖాతా, ద్విచక్ర వాహనాలు, పన్ను చెల్లింపు వంటి వివరాలేవీ లేవని, అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇవి పెద్దగా తేడా చూపే అంశాలు కాదని, ఇళ్లను మంజూరు చేసేనాటికి ఆ వివరాలను కూడా అప్‌లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కోరినట్టు తెలిసింది.
పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్‌ను రూ.లక్షన్నరగా ఖరారు చేసింది. దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో 4 శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఇది చాలా తక్కువని, సంఖ్య మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది.
ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్ట్ రూ.73 వేలుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది. అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
More Stories
పహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హస్తం?
కాశ్మీర్ లోయలో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత
ఏపీ పట్టణాల్లో స్లీపర్‌సెల్స్ పై పోలీసుల డేగకన్ను