అసలు బంగారమే స్వాధీనం చేసుకోలేదు… రన్యా రావు

అసలు బంగారమే స్వాధీనం చేసుకోలేదు… రన్యా రావు
 
* బలవంతపు సెలవుపై ఆమె సవతి తండ్రి
 

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావు తనకు కోర్టు బెయిల్ నిరాకరించడంతో మాటమార్చి తాను అమాయకురాలినని, తనవద్ద అసలు బంగారమే స్వాధీనం చేసుకోలేదని అంటూ కొత్త కధనం తెరపైకి తీసుకు వచ్చారు. మరోవంక, కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న ఆమె సవతి తండ్రి కె.రామచంద్రరావును ‘కంపల్సర్సీ లీవు’పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి.

తాను దుబాయ్‌, అమెరికా, యూరప్ దేశాల్లో పలుమార్లు పర్యటించినట్టు డీఆర్ఐ విచారణలో తొలుత అంగీకరించిన రెన్యారావు తర్వాత తనను అక్రమంగా ఇరికించారని, తాను అమాయకురాలినని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఐర్ఐ సమాచారంతో సీబీఐ సైతం దర్యాప్తు బృందాన్ని బెంగళూరు పంపింది. 

ఎయిర్ పోర్ట్ అధికారులు, సిబ్బంది ఎవరైనా రన్యారావుకు సహకరించారా? అనే కోణం నుంచే కాకుండా, డీజీపీ కె.రామచంద్రరావు ప్రమేయంపై కూడా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. కాగా, రన్యారావు అరెస్టు వెలుగుచూసిన వెంటనే దీనిపై రామచంద్రరావు తనకు కూడా మీడియా వార్తలు చూసిన తర్వాతే అరెస్టు విషయం తెలిసిందని, తాను కూడా అందరిలాగానే దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు.

రన్యారావు తమతో ఉండటంలేదని, తన భర్తతో వేరేగా ఉంటోందని, వారి మధ్య ఏదైనా కుటుంబ సమస్యలు ఉండవచ్చని పేర్కొన్నారు. అంతకుమించి చెప్పేదేమీ లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రామచంద్రరావుపై వినిపిస్తున్న ఆరోపణలపై విచారణకు ఒక అధికారిని కూడా కర్ణాటక ప్రభుత్వం నియమించింది. 

తాజాగా, ఆయనను ‘కంపల్సరీ లీవు’పై వెళ్లాలనే ఆదేశాలు జారీ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. రామచంద్రరావు ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతలను అడిషనల్ డెరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రిక్రూట్‌మెంట్) కెవీ శరత్ చంద్రకు అప్పగించారు. మరోవంక, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారణలో అధికారులు తనను అనేకమార్లు చెంపదెబ్బలు కొట్టారని, తిండి పెట్టలేదని, ఖాళీ డాక్యుమెంట్లపై బలవంతంగా తనతో సంతకాలు పెట్టించారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు డీఆర్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు ఆమె లేఖ రాశారు. 

తాను అమాయకురాలినని, తప్పుడు కేసులో తనను ఇరికించారని ఆమె వాపోయారు. రన్యారావుకు బెయిల్ ఇవ్వడానికి విచారణ కోర్టు శుక్రవారంనాడు నిరాకరించిన నేపథ్యంలో ఆమె తాజా ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విమానంలోనే తనను అరెస్టు చేశారని, తనను మాట్లాడేందుకు కూడా డీఆర్ఐ అవకాశం ఇవ్వకుండా కస్టడీలోకి తీసుకుందని ఆ లేఖలో రన్యారావు పేర్కొన్నారు. డీఆర్ఐ అధికారులు పలుమార్పు తనను చెంపదెబ్బలు కొట్టినా వారు సిద్ధం చేసిన డాక్యుమెంట్లపై సంతకం పెట్టేందుకు తాను నిరాకరిస్తూ వచ్చానని ఆమె స్పష్టం చేశారు. 

అయితే అతి బలవంతం మీద తనతో టైపింగ్ చేసిన 50-60 పేపర్లు, 40 ఖాళీ తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించారని ఆమె ఆరోపించారు. తనను అరెస్టు చేసినప్పటి నుంచి కోర్టు ముందు హాజరుపరచేంత వరకూ అనేక సార్లు శారీరక దాడులు జరిపారని, 10-15 సార్లు చెంపదెబ్బలు కొట్టారని, ఆ అధికారులను తాను గుర్తుపడతానని చెప్పారు.

పైగా, అక్రమ బంగారం కేసులో తనను ప్రశ్నించడంపై చట్టబద్ధతను రన్యారావు ప్రశ్నిస్తూ, తన నుంచి ఎలాంటి బంగారం స్వాధీనం చేసుకోలేదని ఆమె కొట్టిపారవేసారు. ఈ కేసులో అనుమానితులను కాపాడేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆఫీసర్ల పేరు చెప్పుకుని తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు.

 డీఆర్ఐ అధికారులు విచారణలో తన తండ్రి ఐడెంటిటీ చెప్పమని తనను బెదిరించారని, ఈ కేసులో తన తండ్రికి ఎలాంటి ప్రమేయం లేదని ఆమె చెప్పారు. మార్చి 3వ తేదీ రాత్రి 6.45 నుంచి మార్చి 4వ తేదీ రాత్రి 7.50 వరకూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తనను నిద్రపోనీయలేదని, తిండి పెట్టలేదని ఆరోపించారు.

ఆసక్తికరంగా, మార్చి 10న రన్యారావు కోర్టులో చెప్పిన దానికి భిన్నంగా తాజా ఆరోపణలు ఉన్నాయి. డీఆర్ఐ అధికారులు విచారణలో తనను దూషించారని, మానసికంగా వేధించారని, అయితే శారీరక దాడులు మాత్రం చేయలేదని ఆమె స్వయంగా కోర్టులో పేర్కొనడం గమనార్హం.