* విజ్ఞాన్ భారతి జాతీయ సదస్సు ప్రారంభిస్తూ యోగి ఆదిత్యనాథ్
పరిశోధన, ఆవిష్కరణలు ఎల్లప్పుడూ భారత నాగరికతలో అంతర్భాగంగా ఉండి, భారతదేశ శ్రేయస్సుకు, ప్రపంచ నాయకత్వానికి దోహదపడ్డాయని, వ్యవసాయం, ఆరోగ్యం లేదా ఇతర ఆహార పద్ధతులకు సంబంధించిన ప్రాచీన భారతీయ సంప్రదాయాలు శాస్త్రీయ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. విజ్ఞాన్ భారతి 7వ జాతీయ సదస్సును శనివారం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రారంభిస్తూ పరిశోధన, ఆవిష్కరణల లక్ష్యాలు మానవ సంక్షేమం, ఆర్థిక పురోగతి, జాతీయ అభివృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు.
ఇవి మన సమాజాన్ని శక్తివంతం చేయడమే కాకుండా ప్రజలకు కొత్త అవగాహనను, స్ఫూర్తిని అందించాయని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి భారతీయ పద్ధతులను అవలంబించినప్పుడు కూడా మనం దీనికి ఒక ఉదాహరణను చూశామని గుర్తు చేశారు. పరిశోధన, ఆవిష్కరణలు లేకుండా ఏ దేశమూ పురోగమించలేదని ఆయన స్పష్టం చేశారు. యువత తమ శాస్త్రీయ ప్రతిభను, పరిశోధనా సామర్థ్యాలను దేశ నిర్మాణానికి అంకితం చేయాలి. ఆధునిక విజ్ఞానాన్ని సాంప్రదాయ జ్ఞానంతో అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ, సుస్థిర అభివృద్ధి, సహజ వ్యవసాయం, క్షేత్రస్థాయి ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆధునిక విజ్ఞానానికి, భారతదేశ జ్ఞాన సంప్రదాయాలకు మధ్య సమన్వయం నెలకొల్పడానికి కృషి చేస్తున్న విజ్ఞాన్ భారతి లక్ష్యంతో, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య వ్యవస్థాపక దార్శనికతకు గాఢమైన సంబంధం ఉందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అజిత్ కుమార్ చతుర్వేది తెలిపారు. భారతీయ విలువల ఆధారంగా శాస్త్రీయ పరిశోధనను ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
ఆధునిక శాస్త్రీయ పురోగతులకు, భారతదేశ సమగ్ర జ్ఞాన సంప్రదాయాలకు మధ్య సమన్వయం నెలకొల్పాల్సిన ఆవశ్యకత గురించి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారత ప్రచార అధిపతి సునీల్ అంబేకర్ సూచించారు. సమకాలీన విజ్ఞానశాస్త్రం సాంకేతిక పురోగతికి గణనీయంగా దోహదపడిందని, అయితే పర్యావరణం, ఆరోగ్యం, సమాజానికి సంబంధించిన కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సమగ్రమైన, మానవ కేంద్రీకృత విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు.
కృత్రిమ మేధ, ఇతర వర్ధమాన సాంకేతికతల గురించి మాట్లాడుతూ, మానవ సంక్షేమానికి, పర్యావరణ సుస్థిరతకు అటువంటి సాంకేతికతలను ఉపయోగపడేలా చేయడంలో విజ్ఞాన్ భారతి వంటి సంస్థలకు గణనీయమైన బాధ్యత ఉందని ఆయన చెప్పారు. సామాజిక అవసరాల ఆధారంగా పరిశోధనలు, ఆవిష్కరణలు చేపట్టాలని యువతకు పిలుపిచ్చారు.
శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని, భారతీయ భాషలు, భారతదేశపు గొప్ప జ్ఞాన సంప్రదాయాల ద్వారా శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయాలని ఆయన సూచించారు. “మన భాషలు కూడా జ్ఞానం, విజ్ఞానంతో నిండి ఉన్నాయి. మనం ఆధునిక జ్ఞానాన్ని సంస్కృతంతో పాటు ఇతర భాషలు, జానపద భాషలలో ఉన్న జ్ఞానం, విజ్ఞానంతో అనుసంధానించి, సమాజానికి ఉపయోగపడే రూపంలో అందించాలి” అని ఆయన కోరారు.
“భారతదేశం నిరంతరం జీవితంలోని ప్రతి అంశానికి సమగ్ర దృక్పథాన్ని పాటిస్తూ వస్తుంది. కేవలం మానవుల సంక్షేమంపైనే కాకుండా యావత్ విశ్వం సంక్షేమంపై కూడా దృష్టి సారిస్తుంది. అందువల్ల, జీవితంలోని ఏ రంగం లేదా విషయం కూడా దీని ప్రభావానికి అతీతం కాదు” అని స్పష్టం చేశారు.
విజ్ఞాన్ భారతి జాతీయ అధ్యక్షులు, భారత జాతీయ విజ్ఞాన అకాడమీ అధ్యక్షులు డాక్టర్ శేఖర్ సి. మాండే మాట్లాడుతూ, భారతదేశ జ్ఞాన సంప్రదాయాలపై ఆధారపడిన సమగ్ర దృక్పథం ద్వారా శాస్త్రీయ చైతన్యాన్ని పెంపొందించడానికి విజ్ఞాన్ భారతి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయంలో, విజ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత ఒకదానికొకటి పూరకంగా పరిగణించబడతాయని తెలిపారు.
వాతావరణ మార్పు, కృత్రిమ మేధ వంటి ప్రపంచ సవాళ్లను ప్రస్తావిస్తూ, శాస్త్రీయ పరిశోధన, నైతిక విలువలు, నాగరిక దృక్పథం ఏకీకరణ ద్వారా మాత్రమే అర్థవంతమైన పరిష్కారాలను సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. విజ్ఞాన్ భారతి ప్రధాన కార్యదర్శి వివేకానంద విజ్ఞాన్ భారతి ముఖ్య ఇతివృత్తాలైన ప్రాచీన నుండి ఆధునిక విజ్ఞానం, విజ్ఞానం, ఆధ్యాత్మికత, భారతీయ భాషలలో విజ్ఞానం గురించి ప్రస్తావిస్తూ, సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనల ఏకీకరణ ఆవశ్యకత గురించి వివరించారు.
ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, వరల్డ్ ఆయుర్వేద కాంగ్రెస్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్, వివిధ విజ్ఞాన ప్రచార కార్యక్రమాల ద్వారా విజ్ఞాన్ భారతి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి, ఆవిష్కరణలను పెంపొందించడానికి, విజ్ఞాన ప్రసారాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని ఆయన వివరించారు. పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, రైతులు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఆవిష్కరణ, వ్యవస్థాపకతకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించవచ్చని ప్రొఫెసర్ అమిత్ పాత్రా తెలిపారు.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వేద విజ్ఞాన కేంద్రం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిహెచ్‌యు),ఇంటర్-యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు భారతదేశం, విదేశాల నుండి 1,300 మందికి పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.

More Stories
వాంగ్చుక్కు మేదాంత ఆస్పత్రిలో చికిత్సకు కోర్టు అనుమతి
భద్రతా దళాలపైకి బూట్లు, చెప్పులు, బీర్ సీసాలు విసిరారు
నీట్ అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు