రాయలసీమను రతనాల సీమగా మార్చే హార్టికల్చర్ హబ్‌

లక్ష కోట్లతో ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ హబ్‌ రాయలసీమను రతనాల సీమగా మారుస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి నిర్మలా సీతారామన్ ‘రాయలసీమ ఉద్యాన హబ్‌’కు శంకుస్థాపన చేశారు. దేశంలోనే తొలి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటుకు కూడా పునాది రాయి వేశారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమగా మార్చే రెండు గొప్ప కార్యక్రమాలకు గాంధీ జయంతి రోజున శ్రీకారం చుట్టామని చెప్పారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో చేపడుతున్న ఉద్యాన హబ్‌ దేశానికే ఉపయోగపడే ప్రాజెక్టుగా నిలుస్తుందని తెలిపారు. మదనపల్లెలో ఇలాంటి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పారిశ్రామికవేత్త అనంత్‌ అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు.

రైతులకు పంట పెట్టుబడి కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఒక్కో యూరియా బస్తాకు రూ.300కు మించి వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. పంట నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు కిసాన్‌ ఇన్సూరెన్స్‌ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

గ్రామాల్లో గోవర్ధన్‌ పథకం ద్వారా బయోగ్యాస్‌ ఉత్పత్తికి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ పథకాల ద్వారా సోలార్‌ పంపులు అందుబాటులోకి తెస్తున్నామని, వాటితో ఉచిత విద్యుత్‌ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. మత్స్యకారులు, పశుపోషకుల కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టామని, ప్రతి జిల్లాలో జంతు సంరక్షణకు వెటర్నరీ వైద్యుడు, మొబైల్‌ యానిమల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

కరువు సీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగానే రాయలసీమలోని ఎనిమిది జిల్లాలు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఉద్యాన రైతులకు మేలు చేసేలా హార్టికల్చర్‌ హబ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాయలసీమను దీనిద్వారా ప్రపంచానికి కనెక్ట్‌ చేస్తామని, అవకాశాలను అన్‌లాక్‌ చేస్తామని సీఎం వ్యాఖ్యానించారు. 

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ కోసం కేంద్ర సహకారంతో రూ40 వేల కోట్లు, ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మరో రూ60 వేల కోట్లను సమీకరించేలా ప్రణాళికలు రూపొందించామని సీఎం తెలిపారు. ‘‘ప్రాథమిక రంగ వృద్ధిలో ఉద్యాన రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సుమారు రూ.1.50 లక్షల కోట్ల జీవీఏ అందిస్తున్న రంగమిదని చెబుతూ ఈ రంగం ద్వారా మరో రూ.లక్ష కోట్ల జీవీఏను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

“దానివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. సీమ రైతుల తలరాత మారుతుంది. రాయలసీమను రతనాలసీమగా చేస్తానన్న చెప్పా. ఇప్పుడు చేసి చూపిస్తున్నా. సీమ బిడ్డగా నాకు చాలా ఆనందంగా ఉంది. ద టీజ్‌ రైజింగ్‌ రాయలసీమ.’’ అని చంద్రబాబు ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, రిలయన్స్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, మంత్రి నారా లోకేశ్‌ కూడా పాల్గొన్నారు. 

About The Author