సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం

సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం
దేశ సరిహద్దు జిల్లాల్లో జనాభా మార్పులపై సమగ్ర అధ్యయనం చేయాలని ‘ఉన్నత స్థాయి కమిటీ’ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా శనివారం ఆదేశించారు. జనాభా మార్పు ఉన్నత స్థాయి కమిటీ సమావేశంకు ఆయన అధ్యక్షత వహిస్తూ  సరిహద్దు ప్రాంతాల్లో, మెట్రో నగరాల్లో, పారిశ్రామిక పట్టణాల్లో పర్యటించాలని కమిటీని కోరారు. 
అక్రమ చొరబాట్లు, ఇతర అసహజ కారణాల వల్ల ఆయా ప్రాంతాల్లో వచ్చిన మార్పులను గురించి అంచనా వేయాలని కోరారు.
గత నెలలో అక్రమ చొరబాట్లు, ఇతర అసహజ కారణాలతో దేశవ్యాప్తంగా జనాభాలో వచ్చిన మార్పులు గురించి అంచనా వేసి, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలను సూచించేందుకు హోం శాఖ(ఎంహెచ్‌ఎ) నోటిఫికేషన్‌ ‌ద్వారా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.  రిటైర్డ్‌ ‌సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ ‌ప్రకాష్‌ ‌ప్రభాకర్‌ ‌నవ్‌‌లేకర్‌ ‌నేతృత్వంలోని ఈ కమిటీలో జనాభా కమిషనర్‌తో పాటూ రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి దుర్గా శంకర్‌ మిశ్రా, మాజీ ఐపిఎస్‌ అధికారి బాలాజీ శ్రీవాత్సవ, డాక్టర్‌ ‌షామిక రవి సభ్యులుగా వుంటారు. కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ (ఫారినర్స్‌-1) ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వుంటారు. 
 
గత నెలలో ఈ కమిటీ ఏర్పాటును ప్రకటిస్తూ షా, జనాభా మార్పులు అనేది చాలా తీవ్రమైన అంశమని, ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దేశ రక్షణకు, శాంతి భద్రతలకు కూడా సంబంధించిన అంశమని చెప్పారు. అలాగే దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించడం, నిర్బంధించడం, బహిష్కరించడం కోసం ఒక క్రమబద్ధమైన, శాశ్వత యంత్రాంగాన్ని ప్రతిపాదించడం ఈ కమిటీ కీలక బాధ్యతలలో ఒకటని తెలుస్తోంది. 
 
ముఖ్యంగా సున్నితమైన సరిహద్దు ప్రాంతాలు, గణనీయమైన జనాభా మార్పులు చోటుచేసుకుంటున్న ప్రాంతాలు, వలసలు అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది.   సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లోని జనాభా సరళిని పరిశీలించడంతో పాటు, జనాభా గతిశీలతలోని విస్తృత మార్పులను అంచనా వేయడానికి ఈ ప్యానెల్ మహానగరాలను, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను కూడా సందర్శిస్తుంది.