
సంభాల్ మసీదు వివాదం నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం స్పందిస్తూ, ఒకరి మత విశ్వాసాన్ని బలవంతంగా కైవసం చేసుకుని, వారి నమ్మకాలను అణచివేయడం ‘ఆమోదయోగ్యం కాదు’ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇస్లామ్‌కు పూర్వమే ఉనికిలో ఉన్న ‘సంభాల్ గురించి వాస్తవం మనకు తెలిసినప్పుడు అది సబబు కాదని తేల్చి చెప్పారు.
సంభాల్‌లో విష్ణు ఆలయాన్ని 1526లో ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. “ఐదు వేల సంవత్సరాల నాటి గ్రంథాల్లో సంభాల్ ప్రస్తావన ఉన్నది. శ్రీ మహావిష్ణువు భావి అవతారం గురించిన ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి. మరొక వైపు ఇస్లామ్ కేవలం 1400 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఇస్లామ్‌కు పూర్వమే అంటే కనీసం రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నదాని గురించి మాట్లాడుతున్నాను” అని ఆదిత్యనాథ్ చెప్పారు.
సంభాల్ ‘చారిత్రక వాస్తవానికి’ ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. “ఈ విషయాలకు దాఖలాలు శతాబ్దాలుగా ఉనికిలో ఉన్నాయి. గుర్తు ఉంచుకోండి, 1526లో సంభాల్‌లో శ్రీ విష్ణు ఆలయాన్ని కూల్చివేశారు. రెండు సంవత్సరాల తరువాత 1528లో అయోధ్యలో రామాలయాన్ని ధ్వంసం చేశారు” అని ఆయన తెలిపారు.
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ వారపత్రికలు ‘ఆర్గనైజర్’, ‘పాంచజన్య’ లక్నోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో యుపి సిఎం మాట్లాడుతూ, ఆ రెండు ఆలయాల కూల్చివేతలను ‘ఒకే వ్యక్తి సాగించాడు’ అని ఆరోపించారు. ఆలయం కూల్చివేసిన స్థలంలోనిదిగా కొందరు భావిస్తున్న ఒక మసీదుపై కోర్టు ఆదేశంతో సర్వే జరిగిన తరువాత సంభాల్‌లో గత నవంబర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
‘మంథన్: కుంభమేళా, ఆతరువాత’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ, “నేను ఒక యోగిని. నేను ప్రతి వర్గాన్ని, సమాజాన్ని, ప్రార్థన విధానాన్ని గౌరవిస్తుంటాను. మీరు గోరఖ్‌నాథ్ పీఠాన్ని సందర్శించినట్లయితే, అక్కడ ఎవ్వరిపైనా వివక్ష లేదన్నది మీరు చూస్తారు” అని చెప్పారు.
“అక్కడ అన్ని కులాలు, మతాలు, వర్గాల ప్రజలు ఒకే చోట కలసి కూర్చొని భోజనం చేస్తుంటారు. మత అనుబంధాలు ఏవైనప్పటికీ అందరు సాధువులు కలసి భోజనం చేస్తుంటారు. పరస్పర మన్ననలు అందుకుంటుంటారు” అని చెప్పారు.”సంభాల్ ఎల్లప్పుడూ యాత్రా స్థలమే. అక్కడ 68 పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. ఇంత వరకు మేము వాటిలో 18 ప్రదేశాలను తిరిగి పొందగలిగాం. అక్కడ 19 పురాతన బావులు ఉన్నాయి. వాటిని పునరుద్ధరించాం” అని వివరించారు.
56 ఏళ్ల తరువాత మొట్టమొదటిసారిగా సంభాల్‌లో శివాలయంలో జలాభిషేకం జరుగుతోందని ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రతిపక్షాల గురించి ఆదిత్యనాథ్ ప్రస్తావిస్తూ, ‘ఈ సదరు నేతలు అందరూ ఇంత కాలం ఏమి చేస్తున్నారు? మతం, కులం పేరిట వారు జనాన్ని విడదీయడంలో నిమగ్నమై ఉన్నారు’ అని ధ్వజమెత్తారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?