
* పీపుల్స్ పల్స్ రీసర్చ్ ఏపీ వ్యాప్తంగా సర్వే -2
మీకు అందిస్తున్న భోజనం ఎక్కడి నుంచి వస్తుందన్న ప్రశ్నకు 65 శాతం మంది మధ్యాహ్న భోజనం వండే బడి నుండి అని చెప్పగా, 7.6 శాతం మంది సెంట్రలైజ్డ్ కిచెన్ నుండి వస్తుందని, 1.9 శాతం మంది ఎన్జీవో సంస్థల నుంచి వస్తుందని చెప్పగా… ఏకంగా 25.5 శాతం మంది తెలియదని చెప్పారు. వాస్తవానికి ఉప్పు, కారంతో పాటు రుచి విషయంలో మహిళా సంఘాలు వండిన భోజనం బాగుందని అధిక శాతం విద్యార్థులు చెప్పారు.
ప్రయివేట్ సంస్థల కిచెన్ల నుంచి వస్తున్న ఆహారం చప్పగా ఉంటుందన్నారు. దీనితో పాటు వాళ్లు గుడ్లు ఇవ్వడం లేదు. దీనికోసం ఉడకబెట్టిన గుడ్లు బయట నుంచి తీసుకువస్తున్నారు. కాబట్టి, మహిళా సంఘాలకు మరింత పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని అప్పగిస్తే, భోజన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
కాలేజీల్లో మధ్యాహ్న భోజనం స్థానికంగా వండకుండా అక్షయపాత్ర, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఉదాహరణకు జగ్గంపేట, కిర్లంపూడి, కరప కాలేజీల్లో పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వండి తీసుకొస్తుండగా, కాకినాడ కాలేజీకి అక్షయ పాత్ర నుంచి వస్తోంది. సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు కాలేజీలకు బెండపూడిలోని అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి ఆహారం వస్తోంది.
ఇలా తీసుకొస్తున్న ఆహార పదార్థాలు వేడిగా ఉంటున్నాయా? అని అడిగినప్పుడు 58 శాతం మంది కొన్నిసార్లు మాత్రమే వేడిగా ఉంటుందని చెప్పారు. కొన్ని కాలేజీల్లో దాతలు ఇచ్చిన హాట్ బాక్సుల్లో తెచ్చి వడ్డించడం వల్ల వేడిగా ఉంటున్నాయి. కొన్ని కాలేజీల్లో మామూలు గిన్నెలో వడ్డించడం వల్ల తొందరగా చల్లబడిపోతున్నాయి.
వృథా అవుతోందా?
మధ్యాహ్న భోజనంలో వేస్టేజ్ ఉందా? ఉంటే ఎందుకుంటోందని ప్రశ్నించినప్పుడు రైస్ సరిగ్గా లేనప్పుడు 34.8 శాతం, కూరలు బాగాలేనప్పుడు 18.4 శాతం, పదార్థాలు రుచి లేనప్పుడు 14.6 శాతం వేస్టేజ్ ఉంటుందని, వేస్టేజ్ ఉండటం లేదని 32.2 శాతం మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అన్నం తగినంతగా వడ్డిస్తున్నా, కూర మాత్రం అరకొరగా అందించడంతో విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. స్థానికంగా వండిన భోజనం కొంత బాగానే ఉంటోంది. కానీ, ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్న భోజనం కాలేజీకి చేరేసరికి ముద్దగా మారిపోతోంది. దీనివల్ల విద్యార్థులు తక్కువగా తింటుండటంతో ఎక్కువ ఆహారం వృథా అవుతోంది.
పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం వెజ్ పులావ్ వడ్డించే రోజు విద్యార్థులు ఎక్కువగా భోజనం చేస్తున్నారు. అయితే, పులిహార తరచుగా ముద్దగా ఉండటంతో ఆ రోజుల్లో తినే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ప్రైవేట్ సంస్థలు సరఫరా చేస్తున్న ఆహారం పొద్దున్నే రావడం, గంటల తరబడి బాక్సుల్లో నిల్వ ఉంచడంతో మెత్తబడిపోతోంది. కొన్నిసార్లు పాచిపోవడం కూడా జరగుతోంది. దీంతో విద్యార్థులు తినలేక ఆహారం వృథా అవుతోంది.ఈ సమస్యకు పరిష్కారంగా భోజనం నాణ్యత మెరుగుపరిచేలా కాలేజీలోనే వండి, వడ్డించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది.
పరిశుభ్రత కరువు
భోజనం వండే ప్రదేశం, విద్యార్థులు భోజనం చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం చేయడానికి ఇచ్చే ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా ఉంటున్నాయా? అని విద్యార్థులను అడిగినప్పుడు ఉంటున్నాయి అని 56.1 శాతం చెప్పగా, ఉండటం లేదని 17.6 శాతం, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి అని 26.3 శాతం చెప్పారు. భోజనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉంటుందా? అని అడిగినప్పుడు 50.5 శాతం ఉంటుందని చెప్పగా, 32.6 శాతం ఉండటం లేదని, కొన్నిసార్లు మాత్రమే శుభ్రంగా ఉంటున్నాయి 16.9 శాతం మంది చెప్పారు. శుభ్రత ఉండాలంటే కచ్చితంగా సంబంధిత అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేయాలి.
ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 40 ప్రకారం… ఈ పథకాన్ని దగ్గరుండి చూసుకోవాల్సింది కాలేజీ ప్రిన్సిపల్సే! కానీ, చాలా కాలేజీల్లో వారు ఇతర పనుల్లో తలమునకలవ్వడం వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్తున్నారు. కాలేజీ ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి సారించిన కాలేజీల్లో మాత్రం మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల శాతం ఎక్కువగా ఉంది. అక్కడ ఈ కాలేజీల్లో ప్లేట్లు, గ్లాసులు శుభ్రంగా ఉండటంతో పాటు, భోజనం నాణ్యత మెరుగ్గా ఉంది. ఉదాహరణకు పీపుల్స్‌పల్స్ బృందం పరిశీలించిన జగ్గంపేట, కరప (వేలంగి), పోలాకి, కోటబొమ్మాలి, ఆముదాల వలస కాలేజీల్లో ప్రిన్సిపల్స్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల దాదాపు 95 శాతం విద్యార్థులు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు.
తనిఖీలు లేవు
మధ్యాహ్న భోజనం సరిగ్గా పెడుతున్నది, లేనిది తనిఖీలు చేయడానికి ఎవరైనా వస్తుంటారా? అని విద్యార్థులను అడిగినప్పుడు 79.8 శాత మంది రావడం లేదని చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు, ప్రజా ప్రతినిధులు రానప్పుడు కనీసం అధ్యాపకుల పర్యవేక్షణ అయినా ఉండాలి. కానీ, తమకు అనేక బాధ్యతలు ఉండటం వల్ల ఈ పర్యవేక్షణ సరిగ్గా చేయలేపోతున్నామని అధ్యాపకులు చెప్తున్నారు.
ఈ విషయాలను పరిశీలిస్తే భోజనం నాణ్యత, ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించేందుకు కచ్చితంగా ఆకస్మిక తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా, విద్యార్థులకు మేలు కలిగించేలా మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలవుతుంది.
విద్యార్థుల గోడు వినేది ఎవరు?
సేవలైనా, పాలనైనా మెరుగుపడాలంటే సరైన ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరించే వ్యవస్థ కచ్చితంగా ఉండాలి. కానీ, మధ్యాహ్న భోజన పథకానికి అలాంటి వ్యవస్థ లేకపోవడం విద్యార్థులకు పెద్ద సమస్యగా మారింది. 81.8 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సమస్యల గురించి ఫిర్యాదు చేసే సౌకర్యమే లేదని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా దీనిని పట్టించుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఏకాభిప్రాయంగా చెప్పారు.
కొంతమంది విద్యార్థులు సమస్యలను ప్రిన్సిపల్ లేదా అధ్యాపకులకు తెలియజేస్తున్నా పరిస్థితిలో ఏ మార్పు రావడం లేదని చెప్పారు. ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుని వెంటనే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ లేదా ఫీడ్‌బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతినెలా అధికారుల సమీక్ష నిర్వహించి, విద్యార్థుల ఫిర్యాదులపై స్పందించాలి. ప్రిన్సిపల్స్, అధ్యాపకులు తక్షణ చర్యలు తీసుకునేలా వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పాలి. విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోకపోతే, మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం నీరుగారిపోవడం ఖాయం.
మంచినీటి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
భోజనానికి కంటే ముందు మంచి నీరు చాలా ముఖ్యం. మన ఇంటికి ఎవరైనా వస్తే ముందుగా మంచినీళ్లే ఇస్తాం. తాగడానికి సరిపడా నీళ్లు లేకపోతే, భోజనం చేయాలనిపించదు. కానీ, చాలా కాజీల్లో తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. భోజన సమయంలో తాగునీరు అందుతోందా? అని విద్యార్థులను అడగ్గా 57.3 శాతం అందుతోందని, 31.4 శాతం అందట్లేదని చెప్పగా 11.3 శాతం మాత్రం సొంత బాటిల్స్ తెచ్చుకుంటామన్నారు.
‘‘తాగడానికి సరిగ్గా నీళ్లు లేకపోతే భోజనం కూడా చేయాలనిపించదు. అందుకే నేను అప్పుడప్పుడే తింటాను’’ అని అనంతపురంలో సోమశేఖర్ అనే విద్యార్థి చెప్పాడు. కాలేజీల్లో కనీస అవసరమైన తాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
భోజనం చేయడానికి వసతుల కొరత
కాలేజీల్లో భోజనం సమయానికి అందిస్తున్నప్పటికీ, తినేందుకు సరైన వసతులు లేకపోవడం విద్యార్థులకు ప్రధాన సమస్యగా మారింది. భోజన సమయంలో కూర్చునే సదుపాయం ఉందా? అని విద్యార్థులను అడిగినప్పుడు 45.3 శాతం ఉంటుందని, 32 శాతం ఉండదని చెప్పగా 22.7 శాతం ఎక్కడో చోట సర్థుకుంటున్నాము అన్నారు. ఎక్కువమంది చెట్ల కింద, లేక ఆరు బయట కూర్చోని తినడం పీపుల్స్ పల్స్ బృందం అనేక కాలేజీల్లో చూసింది. కాలేజీల్లో డైనింగ్ హాల్స్ లేకపోవడంతో మధ్యాహ్న భోజనం ఒక అన్నదాన కార్యక్రమంలా సాగుతోంది.
అయితే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే విద్యార్థులు మానవతా విలువలు పాటిస్తున్నారు. రాజకీయ నాయకులు సృష్టించే కుల మత భావనలు వారిలో లేవు. భోజన సమయంలో ఇతరులతో కలిసి కూర్చుంటున్నారా? అని విద్యార్థులను అడిగినప్పుడు కలిసే తింటామని 90 శాతం చెప్పడమే ఇందుకు నిదర్శనం. భోజనం పెట్టడమే కాక, విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో తినేలా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యతే!
విద్యార్థి సంఘాల వైఫల్యం
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు విద్యార్థి సంఘాల మద్దతు లేదని పీపుల్స్ పల్స్ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ పథకంపై విద్యార్థి సంఘాలు శ్రద్ధ పెడుతున్నాయా అని ఆరా తీయగా… ఏ విద్యార్థి సంఘం ఈ పథకంలో ఉన్న లోపాలను పట్టించుకోవడం లేదని తెలిసింది. విద్యార్థి సంఘాలు ఎంతసేపూ ప్రయివేట్ విద్యా సంస్థల చుట్టూ తిరుగుతూ తమ బంధువులకు ఫ్రీ అడ్మిషన్స్ ఇప్పించుకోవడం, సెటిల్ మెంట్స్ చేసుకోవడంలోనే బిజీగా ఉంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం సహా కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా ఈ సమస్యలపై మౌనంగా ఉండటం గమనార్హం. విద్యార్థుల ప్రయోజనాలు కాపాడడం కోసం ఏర్పడ్డ సంఘాలు ప్రభుత్వ విధానాల్లో లోపాలను ఎత్తి చూపాలి, పరిష్కారం కోసం పోరాడాలి. కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేయడం దురదృష్టకరం.
ప్రచారానికే పరిమితమవుతున్న నేతలు, మీడియా
డొక్కా సీతమ్మ పథకం ప్రారంభంలో రాజకీయల నేతలతో పాటు మీడియా కూడా ఎంతో హడావుడి చేయడం తప్ప పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వాటిలో లోటుపాట్లను గమనించడంలో నేతలతో పాటు మీడియా కూడా పూర్తిగా విఫలమైనట్లు మా అధ్యయనంలో తేలింది. స్థానిక నేతలు పథకం అమలు తీరును పట్టించుకుంటున్నారా..? అప్పుడుడప్పుడు పర్యవేక్షిస్తున్నారా..? అని విద్యార్థులను అడగ్గా అలంటిదేమీ లేదనే అభిప్రాయం అన్నిచోట్ల వినిపించింది.
ఇక మీడియా కూడా ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప, ఈ పథకం అమలు తీరుపై వార్తలు రాసిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇంటర్ విద్యార్థులకు పోషకాహారం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఆదారణ పెరిగే అవకాశం ఉంది. ఇంటర్ పూర్తి కాగానే, విద్యార్థులకు ఓటు హక్కు కూడా వస్తుంది. కాబట్టి, ప్రభుత్వం వారికి మంచి ఆహారం అందిస్తే.. భవిష్యత్తులో వారు గుర్తుపెట్టుకుని ఓట్లు కూడా వేసే అవకాశం ఉంది. కాబట్టి, ఈ పథకాన్ని ఏదో మొక్కుబడిగా అమలు చేయకుండా, వారి భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడిగా భావించాలి.
కొన్ని సూచనలు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తూ అంతా బాగుందనే భ్రమల్లో ప్రభుత్వం ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. పథకం ఎలా అమలవుతుందో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహిస్తే ప్రయోజకరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి కేటాయిస్తున్న రూ.14.50 నిధులను కనీసం రూ.30 లకు పెంచాలి.
అన్న క్యాంటీన్‌లో ఒక్క ప్లేటుకు ప్రభుత్వం రూ.22 కేటాయిస్తుండగా, లబ్ధిదారుని నుండి రూ.5 లు వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం రూ.27 లు అక్షయ పాత్ర వారికి ప్రభుత్వం అందజేస్తుంది. కానీ, ఇంటర్ విద్యార్థులకు మాత్రం రూ. 14.50 మాత్రమే కేటాయిస్తోంది. ప్రభుత్వం ఖచ్చితంగా కనీసం రూ.30 లు ఒక్కొక్క విద్యార్థికి ఒక్క భోజనానికి అందజేయాలి.
అక్షయ పాత్ర లేదా ఇతర ప్రయివేట్ సంస్థలు వెల్లుల్లి, ఉప్పు, కారం సరైన మోతాదులో వేయకుండా వంట వండి బాక్సుల్లో పొద్దున్నే పంపిస్తుండడంతో ఆహారం మధ్యాహ్నం వరకు చెడిపోతోంది. మరోవైపు బియ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో అన్నం మెత్తగా కావడం, రుచిగా లేకపోవడంతో విద్యార్థులు తినడానికి ఇష్టపడడం లేదు. అన్నం కూడా చెడిపోతుంది. ప్రభుత్వం దొడ్డు బియ్యం అందజేస్తుండడంతో అన్నంలో నాణ్యత లోపిస్తోంది. సన్నబియ్యం సరఫరా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వేలో వెలువడిరది.
ఈ పథకం పర్యవేక్షణ, వాటి నిర్వహణ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక ప్రత్యేక అధికారి నియామకంతో పాటు, ఈ కార్పొరేషన్ బాధ్యతలను ఒక ప్రజా ప్రతినిధికి లేదా సమర్థతగల నాయకుడికి అప్పగించాలి. ఈ కార్పొరేషన్‌లో కాలేజీ ప్రిన్సిపల్‌తో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, సంఘ సేవకులను, విద్యార్థి సంఘాల నేతలను, కార్మికులను కూడా సభ్యులుగా నియమించి వీటి నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం నిత్యం పర్యవేక్షించాలి.
క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే కిందస్థాయి సిబ్బందిలో బాధ్యత పెరుగుతుంది. మంత్రులు, జిల్లా ఇన్చార్జీ మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ పథకం అమలుపై తరచూ తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తే లోటుపాట్లు లేకుండా ఉంటాయి. అంతేకాక విద్యార్థుల్లో కూడా మధ్యాహ్న భోజనంపై భరోసా కూడా ఏర్పడుతుంది.
రాష్ట్ర స్థాయిలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రజా ప్రతినిధులతో, టీచర్స్ ఎమ్మెల్సీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఒక సలహా కమిటీని ప్రభుత్వం అధికారికంగా నియమించి ప్రతీ 15 రోజులకొకసారి సమావేశాలు ఏర్పాటు చేసి వాటిలోని లోటుపాట్లను సరిచేయాలి. ఆయా కాలేజీ పరిధిలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులతో సలహా కమిటీలను ఏర్పాటు చేయాలి.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ పథకంలో దాతలు, పారిశ్రామిక వేత్తలు పాలు పంచుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఈ పథకానికి సంబంధించి వివిధ రూపాల్లో దాతలను ప్రోత్సాహించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే పథకం లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఆహార పదార్థాల నాణ్యత, సిబ్బంది ప్రవర్తన, శుభ్రత తదితర సమస్యలపై విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ఒక వ్యవస్థ లేకపోవడం కూడా పథకంలో ఒక లోపమే. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ గానీ, ప్రతి కాలేజీలో సలహాల బాక్స్ గానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు
అంతరిక్షంలో భగవద్గీత, గణేశుడితో సునీత