అక్రమ ఆక్రమణలను అరికట్టడానికి, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) గురించి మాట్లాడుతూ, ఆ సంస్థను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ `ఎమర్జెన్సీ మనస్తత్వం’ను బహిర్గతం చేశారనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగంగా చెప్పుకొచ్చారు. తనకు తాను హిట్లర్‌గా ప్రొజెక్ట్ చేసుకోవడానికి విఫలయత్నం చేసిన రేవంత్ చివరకు జాతీయ మీడియా ఎదుట నవ్వులపాలయ్యారు.
జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కారొయక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొంటూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటుపై యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో తాను హైడ్రాను తీసుకొచ్చినట్టు చెప్పారు. “హైడ్రా అనేది హిట్లర్ ఫేవరేట్ పదం. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. హిట్లర్‌కు ఉన్న కోర్ టీమ్ పేరు హైడ్రా. ఆ టీమ్ ఎవరినైనా అంతం చేయగలదు. కాబట్టి, నేను హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ వ్యవస్థకు హైడ్రా అని పేరు పెట్టాం” అంటూ హిట్లర్ చరిత్రను తనకు ఇష్టం వచ్చిన్నట్లు వక్రీకరిస్తూ నవ్వులపాలయ్యారు.
అక్రమారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలనే ఉద్దేశంతోనే ఈ నియంతృత్వ కోణాన్ని సీఎం ప్రస్తావించినప్పటికీ, ఆయన చెప్పిన చరిత్ర పూర్తిగా తప్పని తేలిపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. హిట్లర్ కోర్ టీమ్ పేరు హైడ్రా అంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని చరిత్ర గురించితెలుస్తుంది. అసలు హిట్లర్ కు అటువంటి కోర్ టీం అంటూ లేదని చెబుతున్నారు. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండి, కనీస చరిత్ర తెలియకుండా హాలీవుడ్ కల్పిత కథలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం విస్మయం కలిగిస్తుంది.
అసలు చరిత్రలో హిట్లర్‌కు ‘హైడ్రా’ అనే కోర్ టీమ్ లేదు. అది ఆయనకు ఇష్టమైన పదమూ కాదు. ‘మార్వెల్ కామిక్స్’, ‘కెప్టెన్ అమెరికా’ సినిమాల్లో సృష్టించిన ఒక కల్పిత ఉగ్రవాద విలన్ ఆర్గనైజేషన్ పేరు ‘హైడ్రా’. ఆ ఫిక్షనల్ స్టోరీలో దీనిని నాజీలకు అనుసంధానించి చూపించారు. ఆ సినిమా కథను నిజమైన చరిత్ర అనుకొని సీఎం రేవంత్‌రెడ్డి భ్రమపడ్డారంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
గ్రీకు పురాణాల ప్రకారం హైడ్రా అనేది చెడుకు సంకేతం. రాక్షసుల పెంపుడు జంతువు పేరు ‘హైడ్రా’. దానికి పలు తలలు ఉంటాయి. ఒక్క తలను నరికేస్తే, రెట్టింపు తలలు కొత్తగా పుట్టుకొస్తాయి. ‘ఎంతకీ పరిష్కారం కాని సమస్య’కు సంకేతంగా హైడ్రాను సూచిస్తారు. అటువంటి హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నానంటూ రేవంత్ గొప్పగా చెప్పుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ బిజెపి
ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రంగా స్పందించింది. ఆయన ఒక నిరంకుశ వ్యక్తిని కీర్తిస్తున్నారని, అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు ఆందోళనకరమైన రాజకీయ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని చెబుతూ, బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకత్వం చర్య తీసుకుంటుందా? అని ఆయన ప్రశ్నించారు. ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో, పూనావాలా ఈ వ్యాఖ్యలు “హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వాన్ని” ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిరంకుశ రాజకీయాల చరిత్రతో వీటిని ముడిపెట్టారు.
“రేవంత్ రెడ్డి నుండి షాకింగ్ వార్త. కాంగ్రెస్ ప్రమాదకరమైన హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మరోసారి బట్టబయలైంది. హైడ్రాను సృష్టించడానికి హిట్లర్ తనకు స్ఫూర్తినిచ్చాడని రేవంత్ రెడ్డి ఇప్పుడు బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం. ఇందిరా హయాంలోని ఎమర్జెన్సీ నుండి జర్నలిస్టులు, విద్యార్థులపై రేవంత్ అణచివేత వరకు,” అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి మండిపడ్డారు.
ప్రాంతీయ ప్రాతినిధ్యం, పన్నుల విధానంపై రెడ్డి చేసిన వ్యాఖ్యల వైపు దృష్టి మళ్లడంతో వివాదం మరింత తీవ్రమైంది. అదే కార్యక్రమంలో, రాజకీయ అధికారం, వనరులు ఒకేచోట కేంద్రీకృతం కావడంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణ రాష్ట్రాలు గణనీయంగా దోహదపడుతున్నాయని, వాటికి మరింత గుర్తింపు లభించాలని ఆయన వాదించారు.
ఆయన వ్యాఖ్యలను ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య విభజన సృష్టించే ప్రయత్నంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని పూనావాలా ఆరోపించారు. జాతీయ సంస్థలపై ఏ ఒక్క ప్రాంతానికీ ఆధిపత్యం లేదన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. “హిట్లర్ ప్రేమ్ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి జిన్నా ధోరణులను ప్రదర్శిస్తున్నారు. భారతదేశాన్ని విభజించాలని కోరుకుంటున్నారు! రాష్ట్రపతి ఉత్తర భారతదేశానికి చెందినవారని, ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి చెందినవారని అంటున్నారు” అంటూ ధ్వజమెత్తారు.
“మేము పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి వందనం చేయాలని ఆశించే రెండవ తరగతి పౌరులుగా జీవించాలనుకోవడం లేదు. ఈయన నిజంగానే ఇలా అంటున్నారా? ప్రధాని గుజరాత్‌కు చెందినవారు. మన మొదటి గిరిజన రాష్ట్రపతి ఒడిశాకు చెందినవారు. కానీ డీకే సురేష్ తర్వాత ఈయన ‘భారత్ తోడో, టుక్డే’ అని వాదిస్తున్నారు. సంవిధాన రక్షకుడు రాహుల్ గాంధీ ఈయనను తొలగిస్తారా?” అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూనావాలా పోస్ట్ చేశారు.
కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌లో ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ “ఎల్లప్పుడూ దేశ ప్రజల గొంతు నొక్కిందని” ఆరోపించారు. రెడ్డి ఇలా రాశారు: “కాంగ్రెస్ ప్రమాదకరమైన హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మరోసారి బట్టబయలైంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశానని బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. తన నాయకుడు రాహుల్ గాంధీ వాడిన భాషనే అనుకరిస్తూ, హైదరాబాద్‌లోని తన కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ వంటి యుద్ధ పీడిత దేశాల్లోని కూల్చివేతలతో పోలుస్తున్నారు.”
కాంగ్రెస్, రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆక్రమణల కూల్చివేతలో హైడ్రా పాత్ర వివాదాస్పదంగా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి ఆ సదస్సులో దాని పనితీరును సమర్థించారు. పైగా, అది చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడుతోందని, ఇదే నమూనాను ఇతర నగరాల్లోనూ అనుసరించాలని ఆయన సూచించారు. పర్యావరణ సవాళ్లు, వరదలు, అక్రమ ఆక్రమణలను ఎదుర్కోవడానికి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు ప్రత్యేక పరిష్కారాలు అవసరమని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది ప్రారంభంలో, తెలంగాణ హైకోర్టు హైడ్రా పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. దాని ఇటీవలి కూల్చివేత కార్యకలాపాలను “యుద్ధం లాంటి పరిస్థితి”తో పోల్చుతూ, దానిని “సహించలేమని” పేర్కొంది. ఏప్రిల్‌లో హైకోర్టు, సదరు ఆస్తిపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ, హైడ్రా భవిష్యత్ కార్యకలాపాలను పరిమితం చేస్తూ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. 98 ఏళ్ల పిటిషనర్ ఎం.ఎ. షరీఫ్‌కు చెందిన వ్యవసాయ భూమిలో హైడ్రా వందేళ్ల నాటి కట్టడాన్ని కూల్చివేసిన కేసులో ఈ చర్య తీసుకుంది.
గతంలో హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వచ్చినప్పుడు ‘భగవద్గీత స్ఫూర్తితోనే హైడ్రాను తీసుకొచ్చాం, దుష్టశిక్షణ-శిష్టరక్షణే మా లక్ష్యం’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం గమనార్హం. తాజాగా ఇప్పుడు ‘హిట్లర్ నాకు స్ఫూర్తి. అందుకే హైడ్రా పేరు పెట్టాం’ అంటున్నారు. అసలు హైడ్రాకు స్ఫూర్తి భగవద్గీతా? లేక హిట్లరా? అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. చెరువుల పరిరక్షణ కోసం ఉద్దేశించిన ఒక ప్రభుత్వ వ్యవస్థకు శాసనబద్ధమైన అధికారాలు, నిబంధనలు కాకుండా, ఒక వైపు హిట్లర్ లాంటి క్రూర నియంతను ఆదర్శంగా చెప్పడం, మరోవైపు సినిమా కథలను నిజం అనుకుని మాట్లాడటం సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్యాన్ని మాత్రమే వెల్లడిస్తుంది.

More Stories
తీవ్ర ఉద్రిక్తలకు దారితీసిన సీజేపీ ‘చలో పార్లమెంట్’
పదే పదే అంతరాయాలతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
గత ఆరు నెలల్లో 554 మంది భర్తల హత్యలు, ఆత్మహత్యలు