ప్రఖ్యాత శబరిమల శ్రీ ధర్మశాస్త్ర ఆలయంలో భక్తులకు పవిత్ర ప్రసాదాలు అందకపోవడం పెద్ద దుమారానికి దారితీసింది. స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన అరవణ పాయసం, అలాగే అప్పం భక్తులకు తగిన మోతాదులో లభించకపోవడంపై కేరళ దేవాదాయ శాఖ మంత్రి కె. మురళీధరన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సరైన సమన్వయంతో వ్యవహరించడంలో విఫలమవడం వల్లే ఈ సంక్షోభం తలెత్తిందని అసహనం వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు శబరిమల సన్నిధానంలో ప్రసాదాల కొరత తీవ్రతరం కావడంతో అధికారులు పంపిణీపై కఠినమైన ఆంక్షలు విధించాల్సి వచ్చింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒక్కో భక్తుడికి కేవలం ఒక్క అరవణ టిన్,మూడు అప్పం ప్యాకెట్లు మాత్రమే పరిమితం చేశారు. అంతకుమించి, మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలోనే ప్రసాద కౌంటర్లను మూసివేసి, తిరిగి సాయంత్రం 5 గంటలకు తెరిచారు.
గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసిన భక్తులకు ప్రసాదం సరిగ్గా దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురయ్యారు. ఈ అనూహ్య పరిణామాలపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధికారులు స్పందిస్తూ కన్ని మాసం పూజా కార్యక్రమాల కోసం గతేడాదితో పోలిస్తే అదనంగా మరో 50,000 డబ్బాలు కలిపి మొత్తం 2.6 లక్షల అరవణ టిన్నులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
అయితే, ఈసారి ఊహించని రీతిలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో నిల్వలు వేగంగా అరిగిపోయాయని తెలిపారు. సోమవారం నాటికి మొత్తం నిల్వలు కేవలం 14,000 టిన్నులకు మాత్రమే పరిమితమయ్యాయని వారు స్పష్టం చేశారు. ప్రసాదం తయారీ కేంద్రంలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నందునే ఈ సమస్య తలెత్తిందన్న దేవస్వం బోర్డు వాదనను మంత్రి మురళీధరన్ బలంగా తిరస్కరించారు.
ప్లాంట్ మూసివేత వల్ల ఇలాంటి సంక్షోభం వస్తుందని గత మూడు నెలలుగా బోర్డు అధికారులు తన కార్యాలయానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఇలాంటి పరిస్థితి రావడంపై బాధ్యులెవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యల కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
ఎలాంటి ముందస్తు ప్రణాళిక, సరైన సమాచారం లేకుండా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే సీజన్లలో ఇలాంటి కీలక పనులు ఎలా చేపడతారని ఆయన అధికారులను నిలదీశారు. భవిష్యత్తులో అయ్యప్ప భక్తులకు ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
శబరిమల చరిత్రలో నెలవారీ పూజల సమయంలో అరవణ ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారని, ప్రణాళికారాహిత్యం వల్ల రూ. 4 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నాయి. పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ ప్రభుత్వం, దేవస్వమ్ బోర్డు మధ్య నడుస్తున్న ఈ రచ్చ భక్తులను కలవరపెడుతోంది.

More Stories
రాజస్థాన్‌లో ఏడుగురులో ఆరుగురు మేయర్ లను గెల్చుకున్న బిజెపి
పౌరసత్వం కేసులో సోనియా గాంధీపై దర్యాప్తునకు ఆదేశాలు
ట్యాంక్‌బండ్ వద్ద నిమజ్జనం ఆంక్షలపై ఉత్సవ సమితి నిరసనలు