
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడగా, తిరిగి సమావేశం అయింది.
ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేవరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలియజేశారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.
స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడిన జగదీష్ రెడ్డి ఈ సభ అందరిదని, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ కూర్చున్నారని, ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మాట్లాడిన ప్రతి పదాన్ని జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
సభ లోపల, బయట స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏకవచనంతో స్పీకర్ పై మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. స్పీకర్‌ను అవమానించకుండా ఆదర్శనీయ నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోరారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగించాలని, అప్పటి వరకు ఈ సేషన్ మొత్తం ఆ సభ్యున్ని సస్పెండ్ చేయాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
ఈరోజు సభ్యుడు మాట్లాడిన భాష అత్యంత అవమానకరమని, ఒక దళితజాతి బిడ్డ స్పీకర్‌గా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. స్పీకర్‌ను టార్గెట్ చేయడం బాధాకరమని పేర్కొంటూ ఆ సభ్యుని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు ఆమె తెలిపారు.
మరోవైపు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు మద్దతు పలికారు. మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు ఏం ఉందని ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పారు. అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ సంబంధించింది కాదని తెలిపారు.
అయితే సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరగా, అందుకు స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు వచ్చేశారు. సస్పెండ్ అనంతరం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కూర్చున్న జగదీష్ రెడ్డిని అసెంబ్లీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లాలని చీఫ్ మార్షల్ కోరారు.
అయితే సభా వ్యవహారాల నుంచి మాత్రమే సస్పెండ్ చేశారని చీఫ్ మార్షల్‌తో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వాదించారు. ఏ రూల్ ప్రకారం బయటికి పంపాలని చూస్తున్నారని అడిగి రావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెప్పారు. దీంతో చీఫ్ మార్షల్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు