యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ చేసిన రన్యారావు

యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ చేసిన రన్యారావు

కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ  విచారణ సందర్భంగా విస్తుపోయే విషయాలను బయటపెట్టింది. తాను దుబాయ్ నుంచి మొదటి సారి బంగారాన్ని స్మగ్లింగ్ చేశానని, యూట్యూబ్ చూసి బంగారం ఎలా స్మగ్లింగ్ చేయాలో నేర్చుకున్నానని తెలిపింది.

డీఆర్ఐ విచారణలో రన్యారావు మాట్లాడుతూ.. “మార్చి 1వ తేదీన నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అంతకు రెండు వారాల ముందు నుంచి నాకు గుర్తు తెలియని ఫారెన్ నెంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. నన్ను దుబాయ్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3 వద్ద ఉన్న గేట్ దగ్గరకు వెళ్లమని చెప్పారు”. 

“అక్కడ బంగారాన్ని తీసుకుని దుబాయ్ నుంచి బెంగళూరులో డెలివరీ ఇవ్వమని అన్నారు. ఆ బంగారం మొత్తం ప్లాస్టిక్ పాకెట్స్ లో ఉంది. వాటిని నేను నా శరీరానికి అతికించుకున్నాను. దుస్తులు, బూట్లలోనూ కొంత బంగారాన్ని దాచాను” అని వివరించింది.  

డైనింగ్ లాంజ్ లో బంగారం అందుకున్న తర్వాత నేరుగా వాష్ రూమ్ కు వెళ్లింది. ప్యాకెట్లను విప్పిచూస్తే 12 బంగారు కడ్డీలు, కొన్ని కట్ చేసిన ముక్కలు కనిపించాయి. అక్కడ యూట్యూబ్ తెరచి చూసి, శరీరంలో బంగారాన్ని ఏ ఏ ప్రదేశాల్లో దాచుకోవాలో చూసిన తర్వాత ఆమె టేప్ ను ఉపయోగించి, తొడ కండరాలు, నడుము చుట్టూ బంగారు కడ్డీలను చుట్టుకుంది. 

చిన్న చిన్న ముక్కలను బూట్లలోనూ, కొన్ని ముక్కలను తన జేబుల్లోనూ తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 3న ఎమిరేట్స్ విమానంలో బెంగళూరు విమానంలో బెంగళూరు చేరుకుంది. కుంభకోణంతో సంబంధం ఉన్న ఓ ప్రొటోకాల్ అధికారి సాయంతో విమానాశ్రయం సెక్యూరిటీ వ్యవస్థను దాటుకుని ముందుకు సాగింది.

ఇక విమానాశ్రయంలో ప్రొటోకాల్ అధికారి బసప్ప బెల్లూర్ మాట్లాడుతూ, రన్యారావు సవతి తండ్రి, రామచంద్రరావు తన కుటుంబ సభ్యులకు ప్రొటోకాల్ ప్రకారం సహాయం అందించాలని ఎప్పటి కప్పుడూ తనకు సూచించే వారంటూ, ఆయన పంపిన పత్రాన్ని డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు చూపాడు. 

బసప్ప బెల్లూర్ సాయంతో రన్యారావు మరో నాలుగు అడుగుల్లో విమానాశ్రయం బయటకు చేరుతుందని అనుకున్న సమయంలో డిఆర్ ఐ అధికారులు అనుమానించి పట్టుకున్నారు. ఆమెను తనిఖీ చేసి, బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. రన్యారావు గత ఆరు నెలల్లో దాదాపు 27 సార్లు దుబాయ్ కి వెళ్లారు. గతనెల 15 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు దుబాయ్ కి టూర్ కు వెళ్లి వచ్చారు.

మరోవంక, రాన్యా రావుతో లింకున్న బెంగుళూరులోని పలు ప్ర‌దేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ గురువారం సోదాలు నిర్వ‌హిస్తోంది. కాగా, రాన్యా రావుపై సీఐడీ విచార‌ణ‌ను ఉపసంహ‌రించ‌డానికి త‌న‌పై ఎటువంటి వ‌త్తిడి లేద‌ని క‌ర్నాట‌క హోంశాఖ మంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర తెలిపారు.  రాన్యాపై సీఐడీ కేసును ఎత్తివేస్తున్న‌ట్లు చెప్పిన 24 గంటల్లోనే క‌ర్నాట‌క ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది. బంగారం స్మ‌గ్లింగ్ కేసులో రాన్యా తండ్రి, డీజీపీ ర్యాంక్ ఆఫీస‌ర్ కే రామ‌చంద్రా రావు పాత్ర‌ను వెలికి తీసేందుకు అద‌న‌పు సీఎస్ గౌర‌వ్ గుప్తాను నియ‌మించాల‌ని డీపీఏఆర్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.