17 మంది మావోయిస్టులతో `కిరాతక’ దినేష్ లొంగుబాటు

17 మంది మావోయిస్టులతో `కిరాతక’ దినేష్ లొంగుబాటు

* దినేష్ ను ఉరి తీయాలని గ్రామస్థుల నిరసనలు

ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో 17 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 9 మంది తలలపై రూ. 24 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సీఆర్‌పిఎఫ్ పోలీస్‌ల ఎదుట లొంగిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దినేష్ మొడియం (36), అతడి భార్య జ్యోతి తాటి అలియాస్ కళా మొడియం (32) ఉన్నట్టు తెలిపారు.

డినేష్ లొంగిపోవడానికి ముందు వరకు 100కుపైగా మందిని చంపేశాడు. ఇతగాడు ప్రజా రక్షణకు పెద్ద అడ్డంకిగా మారాడు. 2005 నుంచి దినేష్ అరాచకాలు మొదలయ్యాయి. డబ్బుల కోసం ట్రక్ డ్రైవర్లను, కాంట్రాక్టర్లను, సాధారణ ప్రజలను బెదిరించేవాడు. డబ్బులు ఇవ్వకపోతే దారుణంగా హింసించే వాడు. 

అంతటితో అతడి అరాచకాలు ఆగలేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపేసేవాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేవాడు. బీజాపూర్ అడ్డాగా అతడి దారుణాలు సాగేవి. తక్కువ కాలంలోనే దళానికి నాయకుడిగా మారాడు. ఎంతో మంది ప్రజల, పోలీసుల ప్రాణాల్ని బలితీసుకున్న గంగలూర్ కమిటీకి దినేష్ సెక్రెటరీగా పని చేశాడు.

ఈ దళం ఎంత దారుణమైనదంటే సొంత దళానికి చెందిన వారిని కూడా అతి కిరాతకంగా చంపేసిన చరిత్ర ఉంది. దినేష్ కొన్నేళ క్రితం అదే దళంలో సభ్యురాలిగా ఉన్న కళా తాటిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పెరిగి పెద్ద వారయ్యే కొద్దీ దినేష్‌లో భయం పెరుగుతూ వచ్చింది. 

దళంలో ఉంటే తనతో పాటు తన కుటుంబానికి కూడా ఎప్పటికైనా మరణం తప్పదని భావించాడు. అందుకే లొంగిపోవడానికి నిశ్చయించుకున్నాడు. 10 రోజుల క్రితం కుటుంబంతో కలిసి పోలీసులకు లొంగిపోయాడు. దళం ఒత్తిడి మేరకే తాను అన్ని నేరాలు చేశానని అతడు పోలీసులకు చెప్పాడు. ఇక, బీజాపూర్ ప్రాంతంలోని మావోయిస్టులు కంటిమీద కునుకు లేకుండా అల్లాడిపోతున్నారు. దినేష్ దారిలోనే మొత్తం 17 మంది పోలీసులకు లొంగిపోయారు.

దినేష్ తలపై రూ. 8 లక్షలు, జ్యోతి పై రూ. 5 లక్షల వంతున రివార్డు ఉన్నట్టు బీజాపూర్ సీనియర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. అలాగే ఏరియా కమిటీ సభ్యులు దుడ్ల కరంపై రూ. 5 లక్షలు, మరో ఆరుగురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు. వీరందరూ గంగలూరు ఏరియా కమిటీలో వివిధ హోదాల్లో చురుకుగా ఉన్నవారేనని చెప్పారు.

అయితే, మావోయిస్ట్ సబ్ డివిజినల్ జోన్ ఓ ప్రకటనలో దినేష్, అతడి భార్య దళానికి సంబంధించిన డబ్బు తీసుకుని పారిపోయారని, పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆరోపించింది. మరోవంక, డినేష్ లొంగిపోవడాన్ని గంగలూరు ప్రాంత ప్రజలు సహించలేకపోతున్నారు. అతడికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో జనం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. 

దినేష్ 200లకుపైగా మందిని అతి క్రూరంగా చంపేశాడని, ఆడవాళ్లను, పిల్లలను కూడా వదల్లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో మంది ఇళ్లను కూల్చేశాడని, జనం ఊరు విడిచిపారిపోయేలా చేశాడని మండిపడ్డారు. అతడి కారణంగా 152 గ్రామాలు వెనుకబడిపోయాయంటూ బాధపడ్డారు. అలాంటి వాడికి ప్రభుత్వం పునరావాసం కల్పించకూడదని అన్నారు. అతడ్ని వీలైనంత త్వరగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

వీరి లొంగుబాటు వెనుక డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు, బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు కీలకపాత్ర పోషించినట్టు ఎస్పీ వివరించారు. సైద్ధాంతిక లోపాలు, అమాయక గిరిజనుల పట్ల కొందరు సీనియర్లు దోపిడీకి పాల్పడటం, వంటి చర్యలతో కలత చెందడం, భద్రతా బలగాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో వీరంతా లొంగిపోయినట్టు బీజాపూర్ సీనియర్ ఎస్పీ తెలిపారు. 

అలాగే గ్రామాల్లో అభివృద్ధి కోసం తాము చేపట్టిన నియా నెల్లనార్ (యువర్ గుడ్ విలేజ్ ) అనే పథకం పట్ల ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి రూ.25 వేలు చొప్పున సహాయం అందించామని, ప్రధాన స్రవంతి లోకి చేర్చేందుకు ప్రభుత్వ విధానం ప్రకారం వారికి పునరావాసం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది బస్తర్‌లో 792 మంది మావోయిస్టులు లొంగిపోగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో 65 మంది లొంగిపోయారు.