నీట్ యూజీ 2026 పేపర్‌ లీక్‌?.. ప‌రీక్ష‌ ర‌ద్దు

నీట్ యూజీ 2026 పేపర్‌ లీక్‌?.. ప‌రీక్ష‌ ర‌ద్దు
* సిబిఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం 
వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం ఈ నెల 3న నిర్వహించిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) పేపర్‌ లీక్‌ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్న పత్రంలోని 100 ప్రశ్నలు పరీక్షకు ముందే మార్కెట్లో లభ్యమైనట్టు వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీస్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నీట్​ యూజీ 2026 పరీక్షను ర‌ద్దు చేసిన‌ట్లు నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ప్ర‌క‌టించింది. నీట్ ప‌రీక్ష‌కు చెందిన కొత్త తేదీల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఎన్‌టీఏ పేర్కొన్న‌ది.

భారత్‌తోపాటు విదేశాల్లోని 22.79 లక్షలమందికి పైగా విద్యార్థులు ఈ ఏడాది నీట్‌ రాశారు. పేపర్‌ లీక్‌ అయినట్టు వస్తున్న ఆరోపణలపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం సుదీర్ఘ వివరణ ఇచ్చింది. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలు జరుగలేదని, పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య పరీక్ష నిర్వహించామని పేర్కొంది. అయితే,  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు, పోలీసులు ఇచ్చిన స‌మాచారం ప్ర‌కారం ఎగ్జామ్ ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు తెలుస్తోంది.

మరోవైపు నీట్ పరీక్షలో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తునకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. అందుకు అవసరమైన అన్ని రికార్డులు, పత్రాలు, సమాచారాన్ని అందిస్తామని పేర్కొంది.  అయితే కొత్త‌గా విద్యార్థుల రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేద‌ని ఎన్టీఏ చెప్పింది. అద‌న‌పు ఎగ్జామ్ ఫీజు కూడా అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఉన్న రిజిస్ట్రేష‌న్ డేటా, ఎగ్జామ్ సెంట‌ర్ల‌ను య‌ధావిధిగా కొన‌సాగించ‌నున్నారు. గ‌తంలో విద్యార్థులు చెల్లించిన ఫీజుల‌ను తిరిగి రిఫండ్ చేయ‌నున్న‌ట్లు ఎన్‌టీఏ ప్ర‌క‌టించింది.

జాతీయ ప‌రీక్ష విధానంపై న‌మ్మ‌కం స‌డ‌ల‌కుండా ఉండేందుకు మ‌ళ్లీ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్‌టీఏ చెప్పింది. ఇది విద్యార్థుల‌కు, వారి త‌ల్లితండ్రుల‌కు ఇబ్బందిని క‌లిగించే అంశ‌మే, కానీ జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా మ‌ళ్లీ ప‌రీక్ష నిర్వ‌హించ‌డ‌మే ఉత్త‌మం అని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు ఎన్ఏటీ పేర్కొన్న‌ది. ఒక‌వేళ ప్ర‌త్యామ్నాయ మార్గంలో వెళ్తే అప్పుడు న‌ష్టం మ‌రింత తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఎన్టీఏ చెప్పింది

నీట్‌ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్‌ అయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్‌ ఎస్‌వోజీ తెలిపింది. తమ దర్యాప్తులో భాగంగా పరీక్ష జరగడానికి ముందు సర్క్యులేట్‌ అయిన ఒక బుక్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నామని అందులో 400కు పైగా ప్రశ్నలున్నాయని దర్యాప్తు అధికారులు చెప్పారు. వాటిలో బయాలజీ, కెమిస్ట్రీకి సంబంధించిన 100 ప్రశ్నలున్నాయని, అవి నీట్‌ పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు చాలా దగ్గరగా ఉన్నాయని వివరించారు.
ఈ వివాదంపై రాజస్థాన్ ఎస్ఒజి అదనపు డైరెక్టర్ జనరల్ విశాల్ బన్సల్  మాట్లాడుతూ “ఈ గెస్ పేపర్ విషయంలో ఏదైనా మోసం లేదా నేరపూరిత కార్యకలాపాలు జరిగాయా అని మేం దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎటువంటి అరెస్టులూ చేయలేదు” అని తెలిపారు. కాగా దీని వెనుక ఒక సంఘటిత నెట్‌వర్క్‌ ఉండవచ్చని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇప్పటికే రాజస్థాన్‌లోని పలు నగరాలు, ఉత్తరాఖండ్‌లో సైతం సోదాలు నిర్వహించామని తెలిపారు.