సుప్రీంకోర్టుకు చేరిన బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం

సుప్రీంకోర్టుకు చేరిన బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం
బెంగాల్ ఎన్నికల ఫలితాల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ, లాయర్ కళ్యాణ్ బెనర్జీ వాదనలు వినిపిస్తూ 2021లో తమ పార్టీ అభ్యర్థులకు 31 స్థానాల్లో వచ్చిన మెజార్టీ ఓట్ల కంటే  తొలగించినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. 
 
ఆ 31 స్థానాల్లో ఈ తొలగింపు వల్ల తమ పార్టీ అభ్యర్థుల విజయంపై తీవ్ర ప్రభావం పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్ఐఆర్‌‌లో మొత్తం 90.8 లక్షల ఓట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఆ 31 స్థానాల్లో ప్రతి దానిలోనూ తొలగించిన ఓటర్ల సంఖ్య, గత ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థుల గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉందని సీనియర్ న్యాయవాది కళ్యాణ్ బెనర్జీ ఎత్తి చూపారు. 
 
చాలా నియోజకవర్గాల్లో తొలగింపు దాదాపు ఒకేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని స్థానాల్లో ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండి, ఓటర్ల జాబితా నుంచి తొలగింపుపై అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్న వారి ఓట్ల వల్ల ఫలితం మారే అవకాశం ఉంటే బాధిత పక్షం పిటిషన్ దాఖలు చేయవచ్చని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
 
గత విచారణలో కోర్టు ఇలాంటి నిబంధనను ప్రతిపాదించింది. ప్రత్యేకంగా ఇలాంటి సందర్భాల్లోనే పిటిషన్లు దాఖలు చేయవచ్చని ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరించింది. వాదనలు కొనసాగించిన టీఎంసీ ఎంపీ  ఓటర్ల జాబితా నుంచి 5,000కు పైగా పేర్లు తొలగించిన ఒక నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థి 862 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉదంతాన్ని ప్రస్తావించారు. 
 
మొత్తం మీద చూస్తే తృణమూల్, బీజేపీల మధ్య ఓట్ల తేడా సుమారు 32 లక్షలు ఉందని, అలాగే తొలగింపునకు వ్యతిరేకంగా 35 లక్షలకుపైగా దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని బెనర్జీ పేర్కొన్నారు. ఈ పిటిషన్ల పరిష్కారంపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి మాట్లాడుతూ  ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియ ప్రకారం ఈ పెండింగ్ పిటిషన్లను క్లియర్ చేయడానికి నాలుగేళ్లు పట్టొచ్చని తెలిపారు.
అయితే, ఫలితాలను తారుమారు చేయడానికి బీజేపీతో కుమ్మక్కయ్యిందని తృణమూల్, ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం తన సొంత గణాంకాలనే ఉటంకిస్తూ అందుకు విరుద్ధంగా వాదించింది. అత్యధిక సంఖ్యలో ఓటర్ల తొలగించిన మాల్దా, ముర్షిదాబాద్ ప్రాంతంలోని కొన్ని నియోజకవర్గాల్లో తృణమూల్‌ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని ఎన్నికల సంఘం పేర్కొంది.
బెంగాల్‌తో 2,217 కిలోమీటర్ల సరిహద్దును పంచుకునే పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో చొరబాటుదారులు వస్తుంటే ఓట్ల కోసం టీఎంసీ వారిని ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపించింది.