జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు

జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ పథకం అమలు

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ పథకం జులై ఒకటి నుంచి అమల్లోకి రానుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ వెలువరించింది. జులై ఒకటి నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వీబీజీ రామ్‌జీ పథకం అమలవుతుందని పేర్కొంది. 

ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త పథకం వచ్చినప్పటికీ కూలీలకు ఎలాంటి అంతరాయం లేకుండా పని దినాలు లభిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.  జూన్ 30 నాటికి ఎంజిఎన్ఆర్ఇజిఎ కింద కొనసాగుతున్న పనులను పరిరక్షించి, కొత్త విధానానికి బదిలీ చేస్తామని నోటిఫికేషన్ వెల్లడించింది. కొత్త విబి గ్రామ్ జి కార్డులు జారీ అయ్యే వరకు, ప్రస్తుతం ఉన్న ఇ- కెవైసి ధృవీకరించిన ఉపాధి హామీ జాబ్ కార్డులు చెల్లుబాటులో ఉంటాయని తెలిపింది. 

ఇ-కెవైసి పెండింగ్ లో ఉన్నందున కార్మికులకు ఉపాధి నిరాకరించబోమని, కార్డులు లేవని వారు గ్రామపంచాయితీ స్థాయిలో నమోదు చేసుకోవాలని సూచించింది. వేతన చెల్లింపులు, ఫిర్యాదుల పరిష్కారం, కేటాయింపు నిబంధనలు, నిబంధనల మార్పుకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదించి సిద్ధం చేస్తున్నామని, త్వరలో వాటిని ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందుబాటులో ఉంచుతామన నోటిఫికేషన్ లో పేర్కొంది

మరోవైపు, వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా, భారత గ్రామీణాభివృద్ధి నిర్మాణంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పు అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఈ పథకం ద్వారా జీవనోపాధి భద్రత, గ్రామీణ ఆదాయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని బలోపేతం చేయడమే ఈ చట్టం లక్ష్యమని పేర్కొంది. 

ఇక, వేతన చెల్లింపుల్లోనూ స్పష్టమైన చర్యలకు ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కార్మికుల బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానంలోనే వేతనాలు జమ చేస్తామని వెల్లడించింది. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోగా లేదా వారానికోసారి వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఆలస్యం అయితే కార్మికులకు పరిహారం చెల్లించే నిబంధనలు కూడా ఉంటాయని పేర్కొంది.

ఇదిలా ఉండగా, వీబీజీ రామ్జీ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించనున్నట్లు కేంద్రం ఇదివరకే పేర్కొంది. ప్రస్తుతం ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కింద అమల్లో ఉన్న 100 రోజుల ఉపాధి హామీతో పోలిస్తే ఇది 25 రోజులు ఎక్కువ. గ్రామీణ జీవనోపాధి భద్రత, ఆదాయ వృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ చట్టం తోడ్పడుతుందని కేంద్రం చెబుతోంది.