ఆస్తి కోసం హత్యలకు పాల్పడినా, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినా చట్టం ముందు అవి చెల్లవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కె.రఘునాథ్ అనే వ్యక్తిని హత్య చేసి, ఆ తర్వాత వీలునామా ద్వారా ఆస్తులు పొందాలని చూసిన డీఏ శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్‌ను తోసిపుచ్చింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఒక వ్యక్తిని హత్య చేసిన, లేదా హత్యకు సహకరించిన వారికి సదరు మృతుడి ఆస్తిపై ఎలాంటి హక్కు ఉండదని తేల్చిచెప్పింది.
ఇది వారసత్వంగా వచ్చే ఆస్తికే కాకుండా వీలునామా ద్వారా సంక్రమించే ఆస్తికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కర్ణాటక భూసంస్కరణల చట్టం నుంచి తప్పించుకోవడానికి బెంగళూరుకు చెందిన డీఏ శ్రీనివాస్ తన వద్ద పనిచేసే కె.రఘునాథ్ పేరిట వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. రఘునాథ్ 2019 మే 4న హత్యకు గురయ్యారు. డీఏ శ్రీనివాస్ దీనికి కారణమనే ఆరోపణలున్నాయి. కేసు కూడా నమోదైంది.
అయితే రఘునాథ్ పేరిట ఉన్న సుమారు రూ.250 కోట్ల విలువైన ఆస్తులు తనవేనని, ఈ మేరకు 2018 ఏప్రిల్‌లో ఆ ఆస్తులు తనకు చెందేలా రఘునాథ్ వీలునామా రాశారని డీఏ శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు. అది అవాస్తవమని, 2016లోనే ఆ ఆస్తులు తమకు చెందేలా రఘునాథ్ వీలునామా రాశారని రఘునాథ్ మంజుల కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రఘునాథ్ హత్యకు సంబంధించి సీబీఐ విచారణ జరుగుతోందని, డీఏ శ్రీనివాస్ అందులో నిందితుడిగా ఉన్నారని వివరించారు.
విచారణ జరిపిన ట్రయల్ కోర్టు శ్రీనివాస్ పిటిషన్‌ను కొట్టివేసింది. కానీ శ్రీనివాస్ దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై మంజుల సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీనిపై జస్టిస్ జేబీ పార్దీవాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆస్తుల విషయంలో ఇరువర్గాల వాదనలను తోసిపుచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించే ఉద్దేశంతో చేసిన ఈ భూముల కొనుగోళ్లు ముమ్మాటికీ బినామీ లావాదేవీలేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
వివాదాస్పదమైన ఈ ఆస్తులు చట్టవిరుద్ధమైన బినామీ లావాదేవీల ద్వారా పొందినవి కాబట్టి, ఇవి అటు నిందితుడైన శ్రీనివా్‌సకు కానీ, ఇటు రఘునాథ్ కుటుంబ సభ్యులకు కానీ దక్కవని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. బినామీ చట్టం సెక్షన్ 27 కింద ఈ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా ఒక అడ్మినిరేస్టటర్‌ను నియమించి, ఆస్తులను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవాలని సూచించింది.

More Stories
విజయ్ ప్రమాణస్వీరంలో `వందేమాతరం’ పూర్తిగా ఆలాపన
తీవ్రవాద ముప్పు హెచ్చరికలతో ఢిల్లీలో అప్రమత్తం
ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని ఎంఆర్ఐవి’ విజయవంతంగా ప్రయోగం