విజయ్‌ ప్రమాణస్వీరంలో `వందేమాతరం’ పూర్తిగా ఆలాపన

విజయ్‌ ప్రమాణస్వీరంలో `వందేమాతరం’ పూర్తిగా ఆలాపన
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌ ప్రమాణస్వీకారం చేయడానికి ముందు వేదికపై వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించారు. ఈ సందర్భంగా గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను పాడటం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా అన్ని అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని రెండు భాగాలను మాత్రమే ఆలపిస్తారు. 
 
అయితే ఇకపై అందులోని ఆరు చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ క్రమంలోనే ప్రమాణస్వీకారం సమయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వం కేంద్రం ఉత్తర్వును తూచా తప్పకుండా పాటించింది. ఆ తర్వాత జాతీయ గీతం ‘జనగణమన’ ను, ‘తమిళ తల్లి’ గీతాలను ఆలపించారు.  బంకించంద్ర ఛటర్జీ తొలుత 1875లో వందేమాతరం గేయాన్ని రచించారు. తర్వాత తన ఆనంద్‌మఠ్‌ నవలలో ఆ గేయాన్ని చేర్చారు.
స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గేయంగా ప్రకటించింది. ఆ గేయంలో ఆరు చరణాలుగా ఉండగా అందులో మతపరమైన ప్రస్తావన లేని రెండు భాగాలను మాత్రమే నాటి ప్రభుత్వం స్వీకరించింది. అయితే ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆరు చరణాలనూ పాడాలని సూచిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రకాల పౌర పురస్కారాలు ఇచ్చే సమయంలో, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లో వందేమాతరం ఆలపించాలని సూచించింది.