మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ఆరంభంలో ఇప్పటికే తీవ్ర వర్షపాత లోటు ఏర్పడింది. ఈ ప్రభావం ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని అంచనా. ఎల్ నినో ఇంత దీర్ఘకాలం ఉండటం వల్ల కేవలం మత్స్య పరిశ్రమపైన, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల స్థితిగతులపైన ప్రభావం చూపడమే కాకుండా 2027 నాటి భారతీయ రుతుపవన సీజన్‌పై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంచనా.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్‌కోయిస్) ఎల్ నినోపై సోమవారం తన మొదటి బులెటిన్‌ను విడుదల చేస్తూ 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఎల్‌నినో ప్రభావం కొనసాగుతుందని అంచనా వేసింది. ఇది జరిగే అవకాశం 70-90 శాతం మధ్య ఉందని, అదే సమయంలో ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్(ఈఎన్‌ఎస్‌వో) పరిస్థితులు తటస్థ దశకు తిరిగి వచ్చే అవకాశం 10-30 శాతం ఉందని సంస్థ తెలిపింది.
వేసవి కాలం వరకు ఎల్‌నినో విస్తరించడం తదుపరి సీజన్‌కు శుభవార్త కాదని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. సముద్రంలో, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు అంత వేగంగా రావు. కచ్చితంగా ఏమీ చెప్పలేనప్పటికీ 2027 రుతుపవన కాలం కూడా ప్రభావితమయ్యే అవకాశాన్ని కొట్టివేయలేము. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఇది చాలా వరకు జరిగే అవకాశం ఉంది అని వాతావరణ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
తొలిసారి తమ సంస్థ నుంచి ఎల్‌నినో బులెటిన్లు వరుసగా విడుదల అవుతాయని ఇన్‌కోయిస్ తెలిపింది. 2026 జూన్ నుంచి 2027 ఫిబ్రవరి వరకు ఉండే అంచనా కాలంలో ఎల్ నినో అనేది ప్రధాన ఈఎన్‌ఎస్‌వో దశగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో కొనసాగడం వల్ల ఉత్తర హిందూ మహాసముద్రం అంతటా సముద్ర పరిస్థితులు ప్రభావితం కావడంతో అధిక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్ర ఉపరితల భాగంగా ఉష్ణ పరిమాణం పెరుగడం, సముద్ర వడగాడ్పులు పెరుగడం వంటివి ఉంటాయని అంచనా.
ఈ పరిస్థితులు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని సముద్ర వాతావరణ వ్యవస్థలు, మత్స్య సంపద, తీరప్రాంత పర్యావరణాలపై ప్రభావం చూపవచ్చని ఇన్‌కోయిస్ పేర్కొన్నది. దీని ప్రభావాల్లో భాగంగా రానున్న చేపల వేట సీజన్‌లో బంగాళాఖాతంలో బలమైన గాలులు, తీవ్ర అలల తాకిడి నెలకొనే అవకాశం ఉంది. సముద్రం వేడెక్కడం వల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో తీరప్రాంతాలు స్థానికంగా కోత, వరదలు, తుపాను ఉప్పెన ప్రభావాలను కూడా ఎదుర్కోవచ్చు.
అయితే మరోవైపు భారత పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో పరిస్థితులు సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటాయని, అలాగే అనుకూల వాతావరణం ఎక్కువ కాలం కొనసాగుతుందని ఇన్‌కోయిస్ తెలిపింది.

More Stories
పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి .. ఒకరు మృతి
9వ తరగతిలో మూడో భాషతో విద్యార్ధులపై అనవసరపు ఒత్తిడి
హర్మూజ్ నౌకల్లో భారతీయ నావికులను నియమించకూడదు