ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-1 గిల్, 2 రోహిత్‌ శర్మ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-1 గిల్, 2 రోహిత్‌ శర్మ
* గిల్ కు ‘‘ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌” అవార్డు 
 
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడోస్థానానికి చేరుకున్నాడు. చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో బ్యాట్‌తో రాణించిన విషయం తెలిసిందే. 76 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌ బుధవారం విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండుస్థానాలు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరాడు. 
 
వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ 784 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఐదోస్థానానికి చేరుకున్నాడు.  ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ దుబాయిలో జరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 41 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. 
 
ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌పై భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌ ఒక పరుగు చేయగా, శుభ్‌మన్‌ గిల్‌ 31 పరుగులు చేశాడు. ఇక శ్రేయాస్‌ అయ్యర్‌ 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ర్యాకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండడం విశేషం. ఇక పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం రెండోస్థానంలో ఉన్నాడు.

కాగా, టీమిండియా యువ బ్యాట్స్‌మన్, స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ ఐసిసి నుండి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఈరోజు ఫిబ్రవరి నెల‌కు ‘‘ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌’ను ప్రకటించింది. ఐసిసి ప్రకటించిన ఫిబ్రవరి నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గిల్ గెలుచుకున్నాడు.

గిల్ తో పాటు, ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ కూడా ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ పడ్డారు. అయితే, గిల్ అత్యధిక ఓట్లతో అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అత్యధికసార్లు ఈ అవార్డును అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. 

గిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం ఇది మూడోసారి. గిల్ ఈ అవార్డును 2023 జనవరి, సెప్టెంబర్ అందుకున్నాడు. ఫిబ్ర‌వ‌రిలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0తో క్లీన్ స్వీప్ చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మాన్ గిల్ ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో సహా 259 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా గిల్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై గిల్ 46 పరుగులు, బంగ్లాదేశ్‌పై సెంచరీ చేశాడు.

ఇక బౌలర్లలో టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా సైతం ర్యాంకింగ్స్‌లో మెరిశారు. కుల్దీప్‌ యాదవ్‌ రెండుస్థానాలు మెరుగుపరుచుకొని మూడోస్థానానికి చేరుకున్నాడు. రవీంద్ర జడేజా సైతం మూడుస్థానాలు మెరుగుపరుచుకొని పదో స్థానంలో నిలిచాడు. శ్రీలంకకు బౌలర్‌ మహిష్ తీక్షణ అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 680 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. 

రెండోస్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచేల్‌ శాంట్నర్‌ ఉండగా.. కేశవ్‌ మహరాజ్‌ (సౌతాఫ్రికా), బెర్నార్డ్ మార్టినస్ స్కోల్ట్జ్ (నమీబియా), మ్యాట్‌ హెన్రి (న్యూజిలాండ్‌), రషిద్‌ ఖాన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌), గుడాకేష్ మోటీ (వెస్టిండిస్‌), షాహిన్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.