రన్యా రావు పెళ్లికి సీఎం సిద్దరామయ్య.. ఫోటో వైరల్

రన్యా రావు పెళ్లికి సీఎం సిద్దరామయ్య.. ఫోటో వైరల్
 
కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు తాజాగా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్‌లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. 
 
కొన్ని నెలల క్రితం రన్యారావు ఓ ఆర్కిటెక్ట్‌ను పెళ్లి చేసుకోగా, ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉండటం ఇప్పుడు కన్నడనాట తీవ్ర రాజకీయ అంశంగా మారింది. రన్యారావు వెనుక పెద్ద పెద్ద నేతలు, ప్రముఖులు ఉన్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా, ఆమె పెళ్లికి సిద్ధరామయ్య వెళ్లిన ఫోటో బయటికి రావడం సంచలనంగా మారింది.
 
బిజెపి నేత అమిత్‌ మాలవీయ ఈ ఫొటోను ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు. రన్యారావు పెళ్లికి వెళ్లినట్లు రుజువు చేసే ఫోటోను షేర్ చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయ రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్‌ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంటి వరకు వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ ఫొటోలో కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర కూడా ఉన్నారని తెలిపారు. 
 
ఈ కేసులో రాజకీయ సంబంధాలు లేవంటూ కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కొట్టి పారేసిన విషయాన్ని కూడా గుర్తు చేసిన అమిత్‌ మాలవీయ  తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగారం స్మగ్లింగ్‌లో రన్యారావుతో సంబంధం ఉన్న వారిని గుర్తించేందుకు సీబీఐ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వేళ, ఈ ఫోటోను అమిత్ మాలవీయ షేర్ చేయడం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
 
ఇక రన్యారావు ఇల్లు, పెళ్లి జరిగిన హోటల్‌కు వెళ్లి సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రన్యారావు పెళ్లికి హాజరైన గెస్ట్‌లు, వారు ఇచ్చిన కానుకలపైనా దృష్టి సారించారు. ఇందుకోసం రన్యారావు పెళ్లి వీడియోను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రన్యారావు వివాహ వేడుకకు సీఎం సిద్ధరామయ్య హాజరైన ఫొటో వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిల్‌ కోసం స్పెషల్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఇక బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ చెకింగ్‌ల నుంచి తప్పించుకునేందుకు రన్యారావుకు సాయం చేసిన అధికారికి సంబంధిత శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయని స్పెషల్ కోర్టుకు డీఆర్‌ఐ అధికారులు విన్నవించారు.