కాంగ్రెస్ ఎమ్యెల్సీ అభ్యర్థిగా విజయశాంతి

కాంగ్రెస్ ఎమ్యెల్సీ అభ్యర్థిగా విజయశాంతి

పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పీసీసీ ప్రచార కమిటీ మాజీ ఛైర్మన్ విజయశాంతిలను ఎమ్యెల్యే కోటా ఎల్యేల్సి అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వెల్లడించింది.  ఎమ్మెల్యే కోటా 4 ఎమ్మెల్సీ స్థానాలు వస్తాయని మొదటి నుంచి భావిస్తున్నారు. 

యితే, మిత్రపక్షమైన సీపీఐ పొత్తులో భాగంగా తమకు ఒక స్థానం ఇవ్వాలని పీసీసీకి విజ్ఞప్తి చేయడంతో మిత్రపక్షమైన సీపీఐకి పొత్తులో భాగంగా ఒక స్థానాన్ని కేటాయించారు.  కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు.

మూడు స్థానాలకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కేతావత్ శంకర్ నాయక్‌, బీసీ సామాజిక వర్గానికి చెందిన విజయశాంతిలను అభ్యర్థులుగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళ విభాగాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తూ పీసీసీకి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోయింది. 

అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ సామాజిక వర్గాల సమీకరణలో అవకాశం లభించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, సంపత్ కుమార్, సిద్దేశ్వర్‌, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఎమ్మెల్సీ టికెట్‌ కోసం ప్రయత్నించిన జాబితాలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చాలా కాలంగా వేచి ఉన్న అద్దంకి దయాకర్‌ కోసం సీఎం రేవంత్‌ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. శంకర్‌ నాయక్‌ను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించగా కోర్‌ కమిటీ సభ్యులు సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ మద్దతిచ్చినట్లు సమాచారం. గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల గత ఇంఛార్జ్‌ మాణిక్ రావు ఠాక్రే.. ఖర్గే వద్ద పట్టుబట్టినట్లు తెలుస్తోంది. గతంలోనే ఆమెకు హామీ ఇచ్చినట్లు చెప్పడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం.