
రాత్రి వెళ్లిన రెస్క్యూ బృందానికి ఒక కార్మికుడి మృతదేహం కనిపించడంతో వెలికి తీస్తున్నారు. మరో రెండు మృతదేహాలు అక్కడే ఉండొచ్చని తవ్వకాలు జరుపుతున్నారు. అయితే అధికారులు మృతదేహం లభ్యమైన విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇంకా బయటకు చెప్పడం లేదు. లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం ఒక మృతదేహాన్ని గుర్తించి ఉదయం బయటకు వచ్చినట్లు తెలిసింది.
బయటకు తీసిన మృతదేహాలను అంబులెన్సుల ద్వారా నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి సొంత రాష్ట్రాలకు పంపించేందుకు జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాత్రి రెవెన్యూ అధికారులు నాగర్ కర్నూల్ నందు హాస్పిటల్ కి వెళ్లి అంబులెన్సులను, సిబ్బందిని అలర్ట్ చేశారు.
ఆదివారం ఎప్పుడైనా మృతదేహాలు బయటకు వస్తాయని డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సులు సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేశారు. టన్నెల్ లోపల భారీగా శిథిలాలు, మట్టి, బురద చేరడంతోపాటు మరో పక్క భారీగా నీళ్లు ఉబికి వస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది. మృతదేహాలను వెలిగితీసేందుకు అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తవ్వుతున్న క్రమంలో దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. కేరళకు చెందిన రెండు క్యాడవర్ డాగ్స్ లతో స్క్వాడ్ బృందం టన్నెల్లోకి మరోసారి లోపలికి వెళ్లారు. లోపల క్యాడవర్ డాగ్స్, జీపీఆర్ డేటా ఆధారంగా గుర్తించిన స్థలాల్లో తవ్వకాలు జరుపగా ఒక మృతదేహం లభ్యం కావడంతో మిగిలిన మృతదేహాలను కూడా గుర్తించడానికి మరోసారి క్యాడవర్ డాగ్స్ బృందం లోపలికి వెళ్లారు. ఒక మృతదేహం బయటపడటంతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు.
ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు.
More Stories
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు