రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ

రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ
 
న్యూడిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్‌ ఉండే 60 రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శాశ్వత హోల్డింగ్‌ ప్రాంతాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రద్దీ నియంత్రణ, విపత్తు నిర్వహణ కోసం కృత్రిమ మేధను వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
దీనిపై అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. ఈ హోల్డింగ్‌ ఏరియాల వద్దకు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా సెపరేటర్లు, గుర్తులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. న్యూడిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటోంది. 
 
న్యూడిల్లీ రైల్వేస్టేషన్‌లో అధికారులు పెద్ద ఎత్తున రైల్వే పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అదనపు బలగాలను రప్పించారు. రైల్వే స్టేషన్‌లోని వంతెనలపై సరైన కారణం లేకుండా ఎవరూ నిల్చోకూడదని ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌నకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
కొందరు ఏ కారణం లేకుండా చాలా సేపు వంతెనలపై నిల్చుని ఉంటున్నారని రైల్వే అధికారులు తెలిపారు. న్యూడిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్‌లో సీసీటీవీ నిఘాను మెరుగుపరిచారు. తొక్కిసలాట తరహా ఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్‌ రైళ్లు వెళ్లే 13 నుంచి 16 ప్లాట్‌ఫామ్‌లలో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 
 
ఇందుకోసం ఢిల్లీ పోలీసులతో పాటు, ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను మోహరించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలను సైతం సిద్ధంగా ఉంచారు. శనివారం న్యూడిల్లీ రైల్వేస్టేషన్‌లో భారీ రద్దీ నెలకొని తొక్కిసలాట జరగ్గా ఆదివారం కూడా వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో ఎక్కేందుకు ఇబ్బంది పడ్డారని ఒక అధికారి తెలిపారు. 
 

మరోసారి తప్పిదాలు జరగకుండా బారికేడ్‌లను ఏర్పాటు చేసి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసినట్టు తెలిపారు. తాత్కాలికంగా ప్లాట్ ఫారం టిక్కెట్ల జారీని నిలిపివేశారు. కేవలం ప్రయాణికులు మాత్రమే రైల్వే స్టేషన్లో ప్రవేశించాలని స్పష్టం చేస్తున్నారు.  రైలులోకి వెళ్లే సమయంలో క్యూ పాటించేవిధంగా చూస్తున్నారు. ఇతర స్టేషన్లలోని భారీ జనసమూహాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో రైల్వే స్టేషన్ వెలుపల కూడా ప్రత్యేకంగా వేచి ఉండే ప్రాంతాలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణీకులు రైలు సమయాన్ని, ప్రయాణానికి సంబంధించిన సమాచారాన్ని పొందుతారు. ఆ క్రమంలో రైలు వస్తుందన్న సమాచారం తర్వాత ప్లాట్‌ఫామ్‌లోకి ప్రయాణీకులను మాత్రమే అనుమతిస్తారు. ఇలా చేయడం ద్వారా ఒకేసారి జనం ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండదు.

అటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌, వారణాసి, అయోధ్య, కాన్పూర్‌, లఖ్‌నవూ సహా రద్దీగా ఉన్న స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భక్తులు అధికారులకు సహకరించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.