
స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ ఎమ్మెల్యేలు అగ్నిమిత్రా పాల్, బిశ్వనాథ్ కారక్, బంకిం చంద్ర ఘోష్‌లపై సోమవారంనాడు సస్పెన్షన్ వేటు పడింది. బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకూ వీరిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇందుకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం వీరంతా సరస్వతి పూజ అంశంపై టీఎంసీ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీ వెలుపల నిరసనకు దిగారు. ఇటీవల సరస్వతి పూజ నిర్వహణ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చిందని, దీనిపై చర్చ జరపాలని అగ్నిమిత్ర పాల్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు.
అయితే ఈ తీర్మానంపై చర్చకు స్పీకర్ నిరాకరించారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే ఆ తీర్మానాన్ని చదవి వినిపించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో సభలో దానిని పాల్ చదవి వినిపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ఎన్నికల ప్రయోజనాల కోసం టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందనే ఆరోపణలకు దిగారు.
చర్చకు పట్టుబడుతూ సువేందు నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లారు. బిజినెస్ పేపర్లను చించివేసి సభలోనే విసిరేయడంతో స్పీకర్ బిమన్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సువేందు అధికారి, అగ్నిమిత్ర పాల్, బంకిం ఘోష్, బిశ్వనాథ్ కారక్‌లను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేశారు.అనంతరం మీడియాతో అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ, మమతా బెనర్జీ ప్రభుత్వం హిందువుల వ్యతిరేక ప్రభుత్వమని, ఈ విషయం అందరికీ తెలిసిందేనని ధ్వజమెత్తారు. ప్రతి నిమిషం, ఏ చిన్న పూజా కార్యక్రమం జరిగినా తాము కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని, సరస్వతి పూజను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జీహాదీలు అడ్డుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని ప్రాంతాల్లో పోలీసుల రక్షణతో పూజలు నిర్వహించుకోవాల్సి వచ్చిందని, చివరకు కోల్‌కతా ‘లా కాలేజీ’లో కూడా కోల్‌కతా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుని పూజలు జరపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఆ కారణంగానే తాము అసెంబ్లీలో వాయిదా తీర్మానం తీసుకువచ్చామని తెలిపారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్పీఠ్ అవార్డు
నాగ్పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు