
కాంగ్రెస్ పార్టీ విదేశీ విభాగానికి నాయకత్వం వహిస్తున్న సామ్ పిట్రోడా చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని, చైనాను శత్రువుగా చూడటం భారత్ మానుకోవాలని పేర్కొనడం పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ, దానికి “చైనా పట్ల అమితమైన ఆకర్షణ” ఉందని ఆరోపించింది.
గతంలో కూడా వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న పిట్రోడా, ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ, చైనా పట్ల భారతదేశపు విధానం ఘర్షణాత్మకమైనదని, ఆ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు.
“చైనా నుంచి భారత్‌కు వచ్చే ముప్పు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమెరికా చైనాను తరచు శత్రువుగా పేర్కొంటూ భారత్‌కు కూడా అదే అలవాటు చేస్తోంది. ప్రస్తుతం అన్ని దేశాలు ఏకటాటిపైకి రావాల్సి సమయం ఆసన్నమైంది. ఘర్షణాత్మక వైఖరి అవసరం లేదు. మొదట్నుంచీ మనం అవలభింస్తున్న ఘర్షణాత్మక వైఖరి కొత్త శత్రువులను సృష్టిస్తోంది. భారత్‌కు సరైన మద్దతు దక్కడం లేదు. మనం ఈ వైఖరిని మార్చుకోవాలి. చైనాను శత్రువుగా ఊహించుకోవడం మానుకోవాలి” అంటూ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా నుండి వచ్చే బెదిరింపులను నియంత్రించగలరా? అనే ప్రశ్నకు ఆయన సమాదానంగా ఈ వాఖ్యలు చేశారు. ఈ వాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి పార్టీ “చైనా పట్ల వ్యామోహం” 2008లో కాంగ్రెస్, పొరుగు దేశాన్ని నడిపే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందంలో వెల్లడైందని పేర్కొంది.
“మన భూమిలో 40,000 చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించిన వారికి ఇప్పటికీ డ్రాగన్ నుండి ఎటువంటి ముప్పు కనిపించడం లేదు…. చైనా పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అమితమైన ఆకర్షణ సారాంశం 2008 కాంగ్రెస్- సిసిపి ఎంఓయులో రహస్యంగా దాగి ఉంది” అని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా ధ్వజమెత్తారు.
ఇటువంటి అభిప్రాయాలను ప్రతిధ్వనిస్తూ, బిజెపి నాయకుడు అజయ్ అలోక్, “సామ్ పిట్రోడా రాహుల్ గాంధీకి గురువు. రాహుల్ గాంధీ పీపుల్స్ లిబరేషన్ పార్టీ ఆఫ్ చైనాతో కూడా రహస్య ఒప్పందంపై సంతకం చేశారు. రాజీవ్ గాంధీ చైనా నుండి నిధులు తీసుకున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ అక్సాయ్ చిన్‌ను, భద్రతా మండలిలో భారతదేశ స్థానాన్ని చైనాకు అప్పగించారు. కాంగ్రెస్, చైనా మధ్య స్నేహం చాలా పాతది,” అంటూ మండిపడ్డారు.
More Stories
వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు
నాగ్‌పుర్ హింస వెనుక బంగ్లాదేశ్ హస్తం?
బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంకై ఆర్ఎస్ఎస్ పిలుపు