ఢిల్లీని వణికించిన భూకంపం

ఢిల్లీని వణికించిన భూకంపం
 
* ఉత్తర భారతదేశ వ్యాప్తంగా ప్రకంపనలు
 
ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా ఈ భూకంపం తీవ్రత కనిపించినట్లు తెలిపింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొంది. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలోనే ఉన్నట్లు వివరించింది.

సోమవారం ఉదయం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్- ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఈ భూకంపం ధాటికి బలమైన ప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రాణభయంతో ఢిల్లీ వాసులు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. ఇక ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమేనని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది.  అయితే, భూకంపం 10 కి.మీ లోతులో ఉందని, ఢిల్లీలోని నాంగ్లోయ్ జాట్ కేంద్రంగా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
 
కొన్ని సెకన్ల పాటు మాత్రమే భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మంచం నుండి కిటికీ వరకు ప్రతిదీ కదలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదిక ద్వారా అందరూ ప్రశాంతంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని కోరారు. “ఢిల్లీ, సమీప ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. అందరూ ప్రశాంతంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని, సాధ్యమయ్యే అనంతర ప్రకంపనల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు” అని ప్రధాని మోదీ  పోస్ట్‌లో పేర్కొన్నారు.
 
ఢిల్లీ తాత్కాలిక ముఖ్యమంత్రి  అతిషి మాట్లాడుతూ, ఢిల్లీలో ఇప్పుడే బలమైన భూకంపం సంభవించిందని, అందరూ సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అతిషి పోస్ట్‌ను తిరిగి షేర్ చేస్తూ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, “అందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు.
భూకంపంపై స్పందిస్తూ, ఢిల్లీ పోలీసులు ఎక్స్ లో ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఒక పోస్ట్ రాశారు. “ఢిల్లీ, మీరందరూ సురక్షితంగా ఉన్నారని మేము ఆశిస్తున్నాము! ఏదైనా అత్యవసర సహాయం కోసం #Dial112. #Earthquake” అని పోస్ట్‌లో ఉంది.
 
గత నెల జనవరి 23వ తేదీన చైనాలోని జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో బలమైన ప్రకంపనలు సంభవించాయి.  అంతకుముందు రెండు వారాల క్రితం జనవరి 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లో స్వల్ప ప్రకంపనలు కనిపించాయి.