ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా

ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా

న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తోందంటూ ఇప్పటికే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా యాక్సిస్ మై ఇండియా సైతం తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఇదే విషయాన్ని సుస్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకొంటుందని ప్రకటించింది. 

ఇంకా చెప్పాలంటే ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టిస్తోందని వెల్లడించింది. బీజేపీ 45 నుంచి 55 సీట్లు కైవసం చేసుకొంటుందని తెలిపింది. ఇక ఓటు షేర్ 48 శాతం ఉంటుందని పేర్కొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల్లో 15 నుంచి 25 సీట్లు మధ్య వస్తాయని చెప్పింది. ఇక ఓటింగ్ షేర్ మాత్రం 42 శాతం ఉంటుందంది. 

ఇక మిగిలిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క స్థానాన్ని గెలుచుకో వచ్చు లేదా అది కూడా ఆ పార్టీకి దక్కక పోవచ్చని వివరించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు షేర్ 7 శాతమేనని ఈ సందర్భంగా యాక్సిల్ మై ఇండియా స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే మాత్రం దాదాపు 27 ఏళ్ల అనంతరం ఆ పార్టీ మళ్లీ దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ వేదికగా అధికారాన్ని కైవసం చేసుకున్నట్లు అవుతుంది. 

అదీకాక ప్రస్తుత అధికార ఆమ్ ఆద్మీ పార ఓటర్ల కోసం అత్యధిక ఉచిత పథకాలు పేరుతో చాలా హామీలు గుప్పించిందని గుర్తు చేసింది. కానీ పరిపాలనా దుర్వినియోగం, అవినీతి, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో ఆప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో బీజేపీకి 52 శాతం మంది అత్యధిక మద్దతు ఈ ఎన్నికల్లో లభించిందని తెలిపింది. 

ఇక ఆప్‌కు 47 శాతం మద్దతు లభించగా అందులో 26 నుంచి 35 వయస్సు వాళ్లు అత్యధికంగా ఉన్నారని పేర్కొంది. మరోవైపు 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపును మహిళలు ప్రభావితం చేశారని సోదాహరణగా తెలిపింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఆ మహిళలంతా బీజేపీకి మద్దతుగా నిలిచారని స్పష్టం చేసింది.