తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 34 మందికి రుయా, స్వీమ్స్ దవాఖానల్లో చికిత్స అందిస్తున్నారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా బైరాగిపట్టెడ వద్ద తీవ్ర తొక్కిసలాట జరిగింది.
గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం తిరుపతిలో వైకుంఠద్వార దర్శనం టోకెన్లను గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జారీచేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు.
దీంతో భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి. పెద్దసంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది. భక్తుల్లో మహిళలు, వృద్ధులు ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. పోలీసులు, స్థానికులు సీపీఆర్ వంటి చర్యలు చేపట్టారు.
భక్తుల రద్దీతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తక్షణమే టోకెన్ల జారీకి నిర్ణయించారు. భక్తులు భారీగా తరలిరావడంతో టోకెన్ల జారీ ప్రారంభించామని టీటీడీ ఈవో అన్నారు.భక్తుల రద్దీని అదుపు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. అన్ని కేంద్రాల వద్దకు అదనపు బలగాలను తరలించారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని, బాధితులకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం అందిస్తుందని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నన్ను బాధించింది. తమ సన్నిహితులను కోల్పోయిన వారి బాధలో నా ఆలోచనలు ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. బాధిత వారికి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది” అని ప్రధాని తెలిపారు.
తిరుపతి తోపులాటలో భక్తుల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి ఘటన తీవ్రంగా కలిచివేసిందన్న సీఎం చంద్రబాబు, టీటీడీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని, ఘటనాస్థలంలో సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు.బాధితులను పరామర్శించేందుకు ఆయన గురువారం తిరుపతి చేస్తున్నట్లు ప్రకటించారు.
తిరుపతి తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటన జరగడం బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలవాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రాహుల్ పిలుపునిచ్చారు.
ఏడుకొండల వాడా మమ్మల్ని క్షమించు స్వామీ.. భక్తకోటి క్షమించండి.. అంటూ తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాలకమండలిని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
More Stories
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
భార్యతో సెల్ఫీతోనే మావోయిస్టు చలపతి హతం!
పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు