తిరుపతి తొక్కిసలాటపై భక్తులలో ఆగ్రవేశాలు

తిరుపతి తొక్కిసలాటపై భక్తులలో ఆగ్రవేశాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా టోకెన్ల జారీ చేసే విషయంలో తిరుపతిలో తొక్కిసలాట జరగడం, ఆరుగురు మృతి చెందడంతో భక్తులలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా టోకెన్ల కోసం వచ్చే భక్తులను అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలం చెందిందని విమర్శలు చెలరేగుతున్నాయి. 
 
ఎంతమంది భక్తులు వస్తారు? వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే విషయంలో జాగ్రత్తలు తీసుకొలేదనే విమర్శలొస్తున్నాయి. భద్రత విషయంలో విఫలమైననట్టు ఆరోపణలున్నాయి. పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి భక్తులను ఒక్కసారిగా వదలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భక్తులు విమర్శిస్తున్నారు.

వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు రోడ్లపై గుమికూడకుండా సిబ్బంది పార్కులో ఉంచారు. పద్మావతి పార్కు నుంచి భక్తులను క్యూలైన్లలోకి వదిలారు. భక్తులను క్యూలైన్లలోకి వదిలే సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో తోపులాట జరిగింది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగా చేయలేదని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద షెడ్లు వేసి భక్తులను ఉంచారు.

క్షతగాత్రులను సకాలంలో దవాఖానలకు తరలించేందుకు అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబసభ్యులు టీటీడీ అధికారులపై మండిపడ్డారు. వైద్య సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సకాలంలో వైద్యం అందకపోవడం వల్లే ముగ్గురు మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను రుయా దవాఖానకు తరలించగా, వైద్యులు పట్టించుకోలేదని బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో క్షతగాత్రులను బంధువులు స్విమ్స్‌కు తరలించారు.
ఉచిత దర్శన టికెట్ల కోసం భారీగా భక్తులు తరలివస్తారని సమాచారం ఉన్నా, ఏర్పాట్లు చేయడంలో టీటీడీ వైఫల్యం చెందిందని భక్తులు మండిపడుతున్నారు. భారీగా భక్తులు కౌంటర్ల వద్దకు చేరుకోవడంతో మంగళవారం రాత్రి 12 గంటలకు ముందుగానే టోకెన్లు ఇచ్చే అవకాశాలున్నాయని భక్తులు తోసుకొచ్చారు. షామియానా కూడా ఏర్పాటు చేయకపోవడంతో చలికి వృద్ధులు, పిల్లలతో వచ్చిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో ముందుగా ప్రకటించిన సమయం కంటే ఎనిమిది గంటల ముందే టోకెన్లు జారీ ప్రారంభించారు. రద్దీ ఎక్కువైనుందునే టోకెన్లు జారీకి నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. క్షేతగాత్రుల్లో 32 మంది రూయా ఆస్పత్రిలో, 14 మంది స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు సుమారు 7 లక్షల మందికి ఉత్తర ద్వారదర్శనం టికెట్లను విడుదల చేసినట్టు అధికారులు ప్రకటించిన దృష్ట్యా ఇప్పటికైనా భద్రతా ఏర్పాట్ల పట్ల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరుతున్నారు.